

పెద్దపల్లి, సెప్టెంబర్ 02, జనం న్యూస్
పెద్దపల్లి జిల్లా తుర్కలమద్దికుంట, కాసులపల్లి, కాచాపూర్, ర్యాకలదేవ్‌పల్లి, రాఘవాపూర్, గౌరెడ్డిపేట, కన్నాల, అందుగలపల్లి గ్రామాల రెవెన్యూ శివారులలో ప్రభుత్వ, పట్టా, ఫారెస్ట్ భూముల నుండి అనుమతి లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు జరిపి, మట్టిని తరలిస్తున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి మట్టి నిర్వాహకులు సానికొమ్ము రాంరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. అతను మాట్లాడుతూ, జిల్లా మైనింగ్ శాఖ ఎ డి అక్రమ మట్టి దందా నిర్వాహకులతో కుమ్మక్కై ప్రభుత్వానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. అక్రమ మట్టి తరలింపుల వివరాలు అందజేస్తే వాటిని గోప్యంగా ఉంచకుండా, నిర్వాహకులకు చేరవేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కారణంగా దందా నిర్వాహకులు తమకు ఫోన్ చేసి దుర్భాషలాడుతూ, ప్రాణహానీ హెచ్చరికలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆదాయం కోసం టి పి లు జారీ చేస్తే, నిర్వాహకులు మాత్రం ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వారికి టిపి లు జారీ చేయకుండా, పునరుద్ధరణలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పండుగ సెలవులు, శనివారం, ఆదివారాల్లో అక్రమ మట్టి తరలింపులు అధికంగా జరుగుతున్నాయని ఆరోపించిన రాంరెడ్డి, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా, ప్రజా ప్రయోజనాలను కాపాడేలా నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ మట్టి దందా నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.