

జనం న్యూస్,సెప్టెంబర్ 03,అచ్యుతాపురం:
అనకాపల్లి నుండి అచ్యుతాపురం రోడ్డు విస్తరణ బాధితులకు విఎంఆర్డిఏ అధికారులు టిడిఆర్ ల పై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని వీఎమ్ఆర్డిఏ వెబ్ సైట్ లో తేదీ లేకుండా నోటీసు పెట్టారని దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలని ఈరోజు వీఎమ్ఆర్డిఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి సెక్రెటరీ మురళీకృష్ణ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు, నిర్వాసితుల సంఘం కో కన్వీనర్ కే రాము,సదాశివరావు మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో భూములు, స్థలాలు, ఇల్లు, షాపులు కోల్పోతున్న నిర్వాసితులకు టిడిఆర్ బాండ్లు వద్దని అన్ని గ్రామాల్లో ఆర్డీవో, విఎంఆర్డిఏ అధికారులు గ్రామసభలు ఏర్పాటు చేశారని, ఈ గ్రామ సభలో 100% నిర్వాసితులు టీడీఆర్ వద్దని వినతి పత్రాలు ఇచ్చి అభిప్రాయాలు తెలియ చేశారని, కలెక్టర్ ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా టిడిఆర్ బాండ్లను వ్యతిరేకించారని, మళ్లీ విఎంఆర్డిఏ అధికారులు అభ్యంతరాలు తెలియజేయాలని సూచించడం అంటే చట్ట విరుద్ధమేనని గతంలో నోటిఫికేషన్ ఇచ్చి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రెవెన్యూ గ్రామాల వారిగా 16 వేల నుంచి 25వేలు గజానికి పరిహారం ఇస్తామని చెప్పి బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ కార్డులు సేకరించారని, ఇప్పుడు టిడిఆర్ పేరుతో నిర్వాసితులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో టిడిఆర్ కు అంగీకరించే ప్రసక్తి లేదని, నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీమిని వెంకటేశ్వరరావు, రాజాన సన్యాసినాయుడు,తనకాల జగ్గారావు, బొడ్డేడ చిన అప్పలనాయుడు, జి వెంకట్ లోకనాథం, సూరి ఆప్పారావు,రైతు సంఘం అధ్యక్షులు కర్రి అప్పారావు, ఎస్ బ్రహ్మాజీ తదితర నిర్వాసితులు పాల్గొన్నారు.