Listen to this article

జనంన్యూస్. 04.సిరికొండ. ప్రతినిధి.

యూరియా ఎరువులను పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సిరికొండ మండలం పెద్దవాల్గొట్ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువుల గోడౌన్ ను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల పంపిణీ తీరుతెన్నుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది యూరియా ఎరువులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని పలువురు స్థానికులు కలెక్టర్ దృష్టికి తేగా, అలాంటివారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతుల ప్రయోజనాల విషయంలో ఎంతమాత్రం రాజీ పడవద్దని, రైతుల అవసరాలకు పూర్తి స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అన్నారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో 70 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. వచ్చే యాసంగి సీజన్ లో కూడా ఎరువుల కొరత తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ పల్లె దవాఖానా, అంగన్వాడి కేంద్రాలను సందర్శించారు. పల్లెదవాఖాన ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి వాకబు చేశారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, టీ.బీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని, వ్యాక్సినేషన్ ను నూటికి నూరు శాతం అమలయ్యేలా చూడాలన్నారు. డెంగ్యు, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, దోమల నివారణ కోసం ఫాగింగ్, స్ప్రే జరిపించాలని అన్నారు. అంగన్వాడి కేంద్రంలో నిరుపయోగంగా మారిన టాయిలెట్ స్థానంలో కొత్త టాయిలెట్ మంజూరు చేసినప్పటికీ పనులు చేపట్టకపోవడాన్ని గమనించిన కలెక్టర్, వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. చిన్నారులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.