

జనం న్యూస్ 04 సెప్టెంబర్( కొత్తగూడెం నియోజకవర్గం )
సెప్టెంబర్ 7న హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐఎఫ్ టియు ఆధ్వర్యంలో జరిగే కాంట్రాక్టు,ఔట్సోర్సింగు వర్కర్ల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు జే. సీతారామయ్య విజ్ఞప్తి చేశారు.బొగ్గు రంగంలో దేశవ్యాప్తంగా హైపవర్ వేతనాలు అమలు చేస్తున్నప్పటికీ సింగరేణిలో అమలు చేయకపోవడం వల్ల 35వేల మంది కాంట్రాక్టు కార్మికులకు 13 ఏండ్లుగా లక్షల రూపాయలు నష్టం జరిగిందని హెచ్ పీసీ వేతనాల అమలు బాధ్యత గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలపై ఉందని కోల్ ఇండియా వేతనాలు సాధనకు సింగరేణిలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఉద్యమానికి సంసిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.కొత్తగూడెంలో బంగ్లోస్ ఏరియాలో రాష్ట్ర సదస్సు ప్రచార సమావేశాలను నిర్వహించారు.ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణిలో 2013 నుండి. కోల్ ఇండియా వేతనాలు చెల్లించాల్సి ఉండగా దానిని అమలు చేయడం లేదని ఒప్పందంపై సంతకం చేసిన ఐదు జాతీయ కార్మిక సంఘాలు సింగరేణి యాజమాన్యం మొండి వైఖరిని ఎండగట్టి,కాంట్రాక్టు కార్మికులకు కోల్ ఇండియా వేతనాలు అమలు చేయించ లేకపోవడంతో కార్మికుల కష్టార్జితం కోట్లాది రూపాయలు కంపెనీ వద్ద ఉన్నాయని పేదరికంలో ఉన్న కాంట్రాక్టు కార్మికులు తమ కుటుంబాల ను పోషించుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.సింగరేణి పాతికేళ్లుగా లాభాలను సాధించడంలో కాంట్రాక్ట్ కార్మికుల కష్టార్జితం ఉందని గత సంవత్సరం 10వేల రూపాయల బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం 5000 చెల్లించి చేతులు దులుపుతుందని 2024..25లాభాల్లో 15% బోనసు చెల్లించాలని,8 గంటల పనిదినం కొన్ని విభాగాల్లో పిఎఫ్,ఈఎస్ఐ, హాస్పిటల్,యూనిఫామ్, సెలవులు తదితర సౌకర్యాలను,హక్కులను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులు ఎడల అనుసరిస్తున్న వివక్షతను నిలదీయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన వేతనాలు చెల్లించాల్సి ఉండగా అందులో ఐదో వంతు కూడా చెల్లించకుండా కాంట్రాక్టు కార్మికులకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆయన విమర్శించారు.కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఏడున జరిగే సదస్సుకు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమానికి సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి ఎన్.సంజీవ్ అధ్యక్షత వహించగా నాగమ్మ, మనమ్మ,రమణ,నర్సమ్మ, రాధా,మంగ,సురేష్,రాజు తదితరులు పాల్గొన్నారు.