Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 11( కొత్తగూడెం నియోజకవర్గం )

కొత్తగూడెం ప్రాంతంలో ఉన్న రైల్వే సమస్యలను పరిష్కరించాలంటూ సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు సభ్యుడు వై. శ్రీనివాస్ రెడ్డి, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బి.డి.సి.ఆర్. రోడ్ ఏవో రాజేంద్రబాబును గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి సన్మానించారు.
రైల్వే బోర్డు సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గతంలో నడిపిన కొత్తగూడెం–బెల్గావి ఎక్స్ప్రెస్, కాజీపేట రైళ్లను తక్షణం పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. కాకతీయ ఎక్స్ప్రెస్‌ను తిరిగి మణుగూరు వరకు నడపాలని, అలాగే మణుగూరు నుండి తిరుపతి, షిరిడీ వరకు ప్రత్యేక రైళ్లు నడపాలని కోరారు.డోర్నకల్–కొత్తగూడెం మధ్య డబ్లింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని, కారేపల్లిలో రెండవ ప్లాట్‌ఫామ్, కొత్తగూడెంలో మూడవ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. కొత్తగూడెం–భద్రాచలం–కోవ్వూరు–ఛత్తీస్‌గఢ్ కీరండోల్ రైల్వే లైన్ పూర్తి చేస్తే కొత్తగూడెం కేంద్రంగా రైల్వే జంక్షన్ ఏర్పడి ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు.అలాగే కొత్తగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని, వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రగతి మైదాన్ రాజీవ్ పార్క్ వద్ద మూసివేసిన దారిని తిరిగి తెరిస్తే పాదచారులు, టూ వీలర్ ప్రయాణికులు ఇబ్బందుల నుంచి బయటపడతారని వివరించారు.ఈ సందర్భంగా ఏవో రాజేంద్రబాబు మాట్లాడుతూ, రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాకతీయ ఎక్స్ప్రెస్‌ను మణుగూరు వరకు నడపడానికి చర్యలు తీసుకుంటామని, కొత్తగూడెం రైల్వే స్టేషన్ పనులు త్వరగా పూర్తిచేస్తామని తెలిపారు. అలాగే బెల్గావి, కాజీపేట రైళ్ల పునరుద్ధరణపై చర్యలు తీసుకుంటామని, రాజీవ్ పార్క్ వద్ద పాదచారులు, వాకర్స్, టూ వీలర్స్ కోసం దారిని ఏర్పాటుచేయడానికి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.