

జనం న్యూస్ సెప్టెంబర్ 19( మరిపెడ బంగ్లా )
జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షులు, సీతారాంపురం హైస్కూల్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మండాది రామచంద్రు ఉద్యోగ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా జె.వివి స్టేట్ కల్చరల్ సెక్రటరీ లింగంపల్లి దయానంద్ మాట్లాడుతూ – “మండాది రామచంద్రు తన ఉద్యోగ కాలమంతా ఉన్నత విలువలకు కట్టుబడి, శాస్త్రబద్ధంగా, ఆచరణాత్మకంగా విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలిచారు. తమ స్వంత పిల్లలనే ప్రభుత్వ పాఠశాలలో చదివించి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ఉద్యోగ విరమణ అంటే సేవకు విరమణ కాదు, ఇకముందు విస్తృత స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రచారానికి ఆయన సేవలు అందించాలని మనం కోరుకోవాలి” అని అన్నారు.కార్యక్రమానికి హాజరైన ఎక్స్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ – “అతిపేద నాయి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రామచంద్రు ఎన్నో విపత్కర పరిస్థితులను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నారు. ఆడంబరాలేమీ లేకుండా సహాయ సహకారాలు అందిస్తూ తన పయనం కొనసాగించారు” అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నోపా కోశాధికారి జంపాల యాకయ్య, నిరంజన్, మస్కాపురి రవి, హోప్ స్టెప్స్ ఫౌండేషన్ చైర్మన్ నాగవల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొని రామచంద్రును సన్మానించారు.మండాది రామచంద్రు ఉద్యోగ విరమణ సమాజ సేవకు కొత్త ఆరంభమని పలువురు అభిప్రాయపడ్డారు.