

42 శాతం రిజర్వేషన్ జాగృతితోనే సాధ్యపడింది
రాష్ట్రంలో… బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత అవసరం
జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్
జనం న్యూస్, అక్టోబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) రాబోవు కాలమంతా బడుగులు, బహుజనులదే రాజ్యమని, అలాగే రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత ఎంతో అవసరమని రాష్ట్ర జాగృతి ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ పేర్కొన్నారు. జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియామకం పొందిన అనంతరం కల్వకుంట్ల కవితను కలిసి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీల్లో ఐక్యత లోపించిన కారణంగానే రాజ్యాధికారానికి దూరం అవుతుండగా, వారిని చైతన్యం చేస్తూ సంఘటత పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు సత్తా చాటాలని, ఇందుకు జాగృతి సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. ముఖ్యంగా బీసీలకు 42 శాతo రిజర్వేషన్ దక్కుతుండడాన్ని కొన్ని పార్టీలు జీర్ణించుకోలేకపోతుండగా, అన్ని పార్టీల్లోని బడుగు బలహీన వర్గాలు అధిష్టానాలను ఒప్పించేందుకు కృషి కోరారు. అయితే కామారెడ్డి డిక్లరేషన్ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, కోర్టులో అడ్డుకోవాలని చూస్తున్న వారికి తగిన రీతిలో జవాబు చెప్పాలని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతుండగా, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తూ తమ అనుచరులను కోర్టులో కేసులు వేయించినట్లు గుర్తు చేశారు. కాగా తమకు న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జాగృతిని పటిష్టం చేసి సత్తా చాటుతామని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాటం చేస్తున్న కవితకు అన్ని వర్గాల నుండి సంపూర్ణ మద్దతు వస్తుండగా, రాష్ట్రంలో జాగృతి, కాంగ్రెస్, బిజెపి మినహా ఇతర పార్టీలు అంతర్ధానం అవుతాయని వివరించారు.