Listen to this article

జనం న్యూస్ 11 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

బీసీల హక్కుల పరిరక్షణ, తెలంగాణలో రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ( టి ఆర్ పి ) నిరసనపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నేడు (శుక్రవారం) టిఆర్పి ఇచ్చిన బంద్ పిలుపు, నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారితీయకముందే, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజును పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.ఈ రోజు తెల్లవారుజామునే పోలీసులు రంగంలోకి దిగి, కొమ్ముల ప్రవీణ్ రాజు నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయన్ను, ఇతర ముఖ్య టిఆర్పి నాయకులను అదుపులోకి తీసుకుని, నేరుగా గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న నాయకులను ముందస్తు అరెస్టు చేయడంపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.”తెలంగాణ లో మరో ఉద్యమం తప్పదు”: కొమ్ముల ప్రవీణ్ రాజు హెచ్చరిక
పోలీస్ స్టేషన్‌లో ఉన్నప్పటికీ, కొమ్ముల ప్రవీణ్ రాజు రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బహుజన రాజ్యాధికారం కోసం తాము చేసే పోరాటాన్ని అణిచివేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.”తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కులు, బహుజనుల వాటా కోసం పోరాటం చేస్తున్న మమ్మల్ని అరెస్టు చేయడం ఈ ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిదర్శనం. ఇలాంటి అప్రజాస్వామిక అరెస్టులకు, అణిచివేతలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఏమాత్రం భయపడరు. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కులను కాలరాస్తే, ఈ గడ్డపై ఖచ్చితంగా మరో తెలంగాణ ఉద్యమం చెలరేగుతుంది. బీసీలు, బహుజనులు తిరగబడితే ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం రాజ్యాధికారం దక్కేవరకు పోరాటం ఆగదు రాష్ట్రంలో ఉన్న సహజ వనరులు, అవకాశాలు, రాజకీయ అధికారం అన్ని వర్గాలకూ సమానంగా దక్కాలనేదే టిఆర్పి ప్రధాన డిమాండ్ అని ప్రవీణ్ రాజు పునరుద్ఘాటించారు. “ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి, ఎవరి వాటా వారికి దక్కేవరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుంటుంది. మా లక్ష్యం కేవలం కొన్ని డిమాండ్ల సాధన కాదు, రాజ్యాధికార స్థాపన,” అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్పి నాయకులు తిరుమలేష్, గోపి ఉన్నారు.