Listen to this article

జనం న్యూస్ 15 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్

దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో బాణసంచా ప్రేలుళ్ళు, ప్రమాదాలు జరగకుండా బాణసంచా నిల్వ ఉంచే గోడౌన్లు, విక్రయించే లైసెన్సు షాపులు, తాత్కాలిక బాణసంచా విక్రయ షాపుల వద్ద వ్యాపారులు తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు, రక్షణ చర్యలు చేపట్టే విధంగా తనిఖీలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అక్టోబరు 14న ఆదేశించారు.జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎన్ మాట్లాడుతూ – బాణసంచా విక్రయించేందుకు విక్రయదారులు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుండి తాత్కాలిక అనుమతులు పొందాలన్నారు. తాత్కాలికంగా బాణసంచా విక్రయాలు చేపట్టే వ్యాపారులు తమ తాత్కాలిక షాపులను నివాస ప్రాంతాలకు, ఆసుపత్రులకు దూరంగా ఉండే విధంగాను, పట్టణ, గ్రామ శివార్లలోని బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే షాపులు ఏర్పాటు చేయాలన్నారు. షావుల మధ్య తప్పనిసరిగా 15మీటర్ల నిర్ధిష్ట దూరం ఉండాలన్నారు. బాణసంచా అనుమతులు ఉన్న షాపుల నుండి మాత్రమే తాత్కాలిక
లైసెన్సులు పొందిన విక్రయదారులు బాణసంచాను కొనుగోళ్ళు చేయాలన్నారు. షాపుల వద్ద ప్రమాదాల నియంత్రణకు ఇసుక బస్తాలు, నీటి టబ్బులు, ఫైర్ నియంత్రికలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. షాపుల వద్ద ఎక్కువ మంది వ్యక్తులు గుంపులుగా ఉండి ఒకేసారి కొనుగోలు చేయకుండా చూసుకోవాలన్నారు. ప్రమాదాల నియంత్రణకు చేపట్టాల్సిన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అగ్ని ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న వస్తువులు, దగ్గరలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు,హెచ్చరికలతో కూడిన బోర్డులను, ప్లెక్సీలను తాత్కాలిక షాపుల వద్ద ఏర్పాటు చేయాలన్నారు. మనుష్యులు ప్రయాణించే
వాహనాల్లో బాణసంచాను రవాణ చేయకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండే మెటీరియల్తో మాత్రమే అనగా ఆన్బెస్టాస్, జి.ఎస్.రేకులతో తాత్కాలిక షాపులను ఏర్పాటు చేసుకోవాలన్నారు.బాణసంచా విక్రయాలు, నిల్వలు ఉంచే షాపులు, గోడౌన్లు వద్ద వెలుగు ఉండేవిధంగాను, లోవలకు, బయటకు వెళ్ళేందుకు వేర్వేరు ద్వారాలు ఉండే విధంగా చూడాలన్నారు. గోడౌన్లులో సురక్షితమైన వైరింగు, ఫైర్ అలారమ్స్ ఉండే విధంగా షాపు యజమానులు చర్యలు చేపట్టే విధంగా చూడాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. షాపు యజమానులు బాణసంచా విక్రయించే షాపులు, నిల్వ ఉండే గోడౌన్లు, తాత్కాలిక షాపుల వద్ద ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నింటిని తప్పనిసరిగా పాటించాలని, లైసెన్సులో అధికారులు సూచించిన సమయం వరకు మాత్రమే విక్రయాలు నిర్వహించే విధంగా చూడాలన్నారు. బాణసంచా వ్యాపారుల తాత్కాలిక లైసెన్సుల గడువు ముగిసిన తరువాత మిగిలిన బాణసంచాను నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన గోడౌన్స్లోనే భద్రపర్చుకోవాలని, జనావాసాల్లోను, ఇండ్లలోను భద్రపర్చవద్దన్నారు.
నిబంధనలు, భద్రత ప్రమాణాలను అతిక్రమించిన వారిపైన, జనావాసాల్లో బాణసంచాను భద్రపర్చిన వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశించారు.