Listen to this article

జనం న్యూస్ 25 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్

కార్తీక శుద్ధ చవితి సందర్భంగా శనివారం తెలుగు లోగిళ్లలో నాగుల చవితి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. నాగదేవతను ఆరాధించడం ద్వారా సకల దోషాలు తొలగి, కుటుంబ క్షేమం, సంతాన సౌభాగ్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్, వై.ఎస్.ఆర్.సి.పి. జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) విజయనగరం, ధర్మపురిలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన సతీమణి మజ్జి పుష్పాంజలి, అల్లుడు ప్రదీప్ నాయుడు,కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్‌ అధ్యక్షురాలు సిరమ్మ పాల్గొన్నారు.వీరంతా పసుపు, కుంకుమ, పూలతో నాగదేవత పుట్టను అలంకరించి, భక్తి పారవశ్యంతో నాగేంద్ర స్వామి పుట్టలో ఆవు పాలు పోశారు.అనంతరం నాగదేవతకు చలిమిడి, చిమ్మిలి, వడపప్పు, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు.తదనంతరం తమ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రాంత ప్రజలకు పాడి పంటలు సమృద్ధిగా లభించాలని నాగదేవతను వేడుకున్నారు.