Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 27

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలనే డిమాండ్‌తో వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన బిఎస్పీ జిల్లా అధ్యక్షులు తడికల శివకుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న 27 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించడంలో బహుజన్ సమాజ్ పార్టీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. “ఎవరి జనాభా ఎంతో – వారి వాటా అంత” అనే నినాదంతో పుట్టిన ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 42% బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి బిఎస్పీ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. అలాగే, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.బహుజన మహనీయుల రాజకీయ ఉద్దేశాన్ని, బిఎస్పీ పార్టీ చేసిన పోరాటాన్ని సమాజానికి చేర్చే విధంగా ప్రతి బహుజన కార్యకర్త పని చేయాలని శివకుమార్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోళ్లపుడి ప్రవీణ్, జిల్లా కోశాధికారి పీకా మల్లికార్జున్, జిల్లా ఆఫీస్ కార్యదర్శి యనగంటి సంపత్, జిల్లా కార్యదర్శి భూక్యా ముత్యాలు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొండగొర్ల రమేష్, మహిళా నాయకురాలు గుగులోత్ సరోజ తదితరులు పాల్గొన్నారు.