Listen to this article

జనం న్యూస్ 29 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్

మెంటాడ మండలం ఆండ్ర పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై కె. సీతారాం మాట్లాడుతూ, మొంధా తుఫాన్ ప్రభావం కారణంగా మండల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.సీతారాం మాట్లాడుతూ — “ప్రజలు ఎవరూ చెరువులు, గెడ్డలు, వాగులు, ముఖ్యంగా చంపావతి నది పరివాహక ప్రాంతాలకు వెళ్లకూడదు. గాలి వేగంగా వీస్తుండటంతో పాడుబడిన ఇళ్ళలో నివసించే వారు జాగ్రత్తలు తీసుకోవాలి. చెట్లు కింద లేదా బలహీన గోడల దగ్గర నిలబడకూడదు,” అని హెచ్చరించారు.అలాగే అత్యవసర పరిస్థితులు తప్పా ఎవరూ బయటకు వెళ్లకూడదని, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదని సూచించారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చెరువులు, గుంటలు, కాలువల దగ్గరికి వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై సీతారాం సూచించారు.“ఎవరికైనా అత్యవసర వైద్య పరిస్థితి కానీ లేదా ప్రమాద స్థితి అయితే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత శాఖలకు సమాచారం ఇవ్వాలి. మొంధా తుఫాన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు కానీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి” అని ఆయన తెలిపారు.