జనం న్యూస్ 30 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) లో కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం బహిర్గతమవుతోంది. ఈ కేసులో మాజీ టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి మాజీ పర్సనల్ అసిస్టెంట్ అప్పన్నను నిన్న రాత్రి సిట్ అధికారులు అరెస్టు చేశారు.సిట్ దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం — బ్లాక్‌లిస్టులో ఉన్న ‘బోలే బాబా డైరీ’ కి సంబంధించిన సంస్థ పేరును దాచిపెట్టి, వేరొక డైరీ పేరుతో కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు తేలింది. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులకు కమీషన్లు అందించి సైలెంట్ చేయడం జరిగిందని ప్రాథమిక విచారణలో సిట్ గుర్తించినట్టు సమాచారం.సంఘటనపై సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టి, వివిధ వ్యక్తులను విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా తెర్లాం మండలంకు చెందిన అప్పన్నను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.టిటిడి లో నాణ్యతహీన నెయ్యి సరఫరా వ్యవహారం బయటకు రావడంతో భక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేవాలయానికి సమర్పించే నైవేద్యానికి ఉపయోగించే నెయ్యి పై కూడా అవినీతి చెయ్యి చేరిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.


