Listen to this article

(జనం న్యూస్ 30అక్టోబర్ ప్రతినిధి: కాసిపేట రవి )

గ్రామ స్వరాజ్య వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే గ్రామపంచాయతీలు నేడు ఆర్థికంగా చితికిపోయాయి.ముఖ్యంగా ప్రభుత్వానికి,ప్రజలకు మధ్యా వారధిగా ఉండే గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిధుల కొరతతో తీవ్ర మానసిక,ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు పల్లెల్లో అత్యవసర పనుల కోసం సొంతంగా అప్పులు చేసి,ఆ భారాన్ని తమ జీతాల నుంచే చెల్లించుకుంటున్న దయానియా పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది.

ఒత్తిడి వర్సెస్ అప్పుల భారం:

ఓవైపు ప్రజలకు పనులు చేసి పెట్టాల్సిన ఒత్తిడి,మరోవైపు పనుల బిల్లులు చెల్లించడానికి ప్రభుత్వ నిధులు లేకపోవడం కార్యదర్శులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అత్యవసరాలకు జేబుకాలి:వీధి దీపాలు కాలిపోతే మార్చాలి,ట్రాక్టర్ కు డీజిల్ పోయాలి,లీకైన తాగునీటి పైపులు రిపేరు చేయించాలి,పారిశుద్ధ్యం సామాగ్రి కొనాలి,ఈ పనులన్నీ ఒక్కరోజు కూడా ఆగడానికి వీల్లేదు.గ్రామాల్లో పనులు ఆగిపోతే, ముందు మా పైనే ప్రజలకు కోపం,ఉన్నతాధికారుల ఒత్తిడి ఉంటుంది. అందుకే,దిక్కు తోచక వడ్డికి అప్పు చేసి మరి పనులు చేయిస్తున్నాం,అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు.జీతం ఖర్చులకే సరిపోతుంది:అనేకమంది కార్యదర్శులకు తమ నెలసరి వేతనం బ్యాంకు ఖాతాలో పడక ముందే,గతంలో చేసిన అప్పులు,అత్యవసర ఖర్చుల లెక్కలు,చుట్టుముడుతున్నాయి.వచ్చే జీతంలో సగం వరకు గ్రామ పంచాయతీ ఖర్చులకే పోవడంతో కుటుంబ పోషణకు పిల్లల చదువులు,ఇంటి ఖర్చుల కోసం మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని.నా జీతం నా కుటుంబానికా? గ్రామ పంచాయతీకా?: అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది”అని ఒక యువ కార్యదర్శి కంటతడి పెట్టుకున్నారు.

కార్మికుల వేదన-కార్యదర్శి ఆవేదన:

నిధుల కొరత కారణంగా అత్యంత దారుణంగా దెబ్బతిన్నది పంచాయతీ కార్మికులు.నెలకు రూ.9000-నుంచి రూ.1,0000 వేతన కోసం ఎదురుచూసే పారిశుద్ధ్య సిబ్బంది,ట్రాక్టర్ డ్రైవర్లకు నెలల తరబడి జీతాలు అందడం లేదుని మరో పారిశుధ్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశాడు. వాళ్లకు జీతాలు ఇవ్వకపోతే పనులు చేయరు.పనులు చేయకపోతే గ్రామం మురుగు, చెత్తతో నిండిపోతుంది.వాళ్లు వచ్చి మాపై నిలదీసిన,ప్రతిసారి వాళ్ళకి అబద్ధం చెప్పలేక,నిజం చెప్పలేక నరకం అనుభవిస్తున్నాం.వాళ్ల కడుపు కొట్టడం మాకు ఇష్టం లేదు,కానీ మా చేతుల్లో ఏమీ లేదు.ఈ పరిస్థితుల్లో కొంతమంది కార్యదర్శులు,కార్మికులు ఉద్యోగం మానేస్తారేమోనన్న భయంతో,వాళ్లకి అడ్వాన్స్ గా కొంత సొంత డబ్బును ఇస్తూ,వాళ్లతో పనులు చేయించుకుంటున్నారు.

అయోమయంలో పాలన యంత్రాంగం:

కేంద్రం నుంచి రావాల్సిన 15 -16వ ఆర్థిక సంఘం నిధులు,రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు జనరల్ ఫండ్ లు, సకాలంలో విడుదల కాకపోవడం పెండింగ్ బిల్లులు క్లియరెన్స్ లేకపోవడం వంటి కారణాల వల్లే ఈ ఆర్థిక సంక్షోభం తలెత్తిందని కార్యదర్శులు ఆవేదన ట్రాక్టర్ల ఈఎంఐలు,కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితిలో,గ్రామ పంచాయతీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించి పోతున్నాయి..గ్రామ పంచాయతీ కార్యదర్శులు తమ వ్యక్తిగత జీవితాలను,ఆర్థిక భద్రతను పణంగా పెట్టి,పల్లె ప్రగతిని,ముందుకు నడిపించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో చాలా చోట్ల ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తూ,అన్ని రకాల ఒత్తిళ్లను భరిస్తున్న వీళ్ళ కష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలి.పెండింగ్ నిధులను, బిల్లులను తక్షణమే విడుదల చేయాలి. లేదంటే,గ్రామ పాలన పూర్తిగా కుంటూపడడమే కాకుండా,అప్పుల పాలైన కార్యదర్శులు కుటుంబాల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉంది. ఈ సమస్యపై ప్రభుత్వం అత్యున్నత స్థాయి జోక్యం తప్పనిసరి.