Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 31

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అనూహ్య పరిణామాల వేళ రేవంత్ కేబినెట్ లో అజారుద్దీన్ మంత్రి అయ్యారు.

జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ వ్యూహాత్మక నిర్ణయంలో భాగంగా అజారుద్దీన్ కు మంత్రి పదవి దక్కింది. రాజ్ భవన్ లో గవర్నర్ మంత్రిగా అజారుద్దీన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక.. అజారుద్దీన్ కు కేటాయించే శాఖల పైన రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో కొందరి మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఖాయంగా కనిపిస్తోంది.అజారుద్దీన్ ఎట్టకేలకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి ఓడిపోయిన అజారుద్దీన్ కు..ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక వేళ మంత్రిగా అవకాశం దక్కింది. రాష్ట్ర మంత్రి వర్గంలో ముస్లిం మైనార్టీ వర్గానికి ప్రాతినిధ్యం లేదు. జూబ్లీహిల్స్ లో మైనార్టీ ఓటింగ్ గెలుపు ఓటములను డిసైడ్ చేయటంలో కీలక భూమిక పోషించనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో సీటు ఆశించిన అజారుద్దీన్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫారసు చేసారు.కోదండ రెడ్డి తో పాటుగా అజారుద్దీన్ పేరును గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఇప్పటి వరకు ఆ ప్రతిపాదనలకు ఆమోదం లభించ లేదు. ఏదైనా సాంకేతిక కారణాలో నిర్ణయం ఆగినా.. ఇతర కోటాలో ఆరు నెలల్లోగా అజారుద్దీన్ ను ఎమ్మెల్సీని చేయాలని రేవంత్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు మంత్రిగా అవకాశం కల్పించారు.
ఇక.. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఖరారు అయిన తరువాత అనేక రకాల చర్చలు తెర మీదకు వచ్చాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో ఒక వర్గం ఓట్ల కోసమే అజారుద్దీన్ ను మంత్రి చేస్తున్నారంటూ బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నిక తరువాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. దీని పైన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అభిప్రాయం కోరారు. ఎలాంటి అభ్యంతరాలు రాకపోవటంతో ముందుగా నిర్ణయించిన విధంగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం జరిగింది.సీఎం రేవంత్.. మంత్రులు ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఇక.. అజారుద్దీన్ కు మైనార్టీ సంక్షేమంతో పాటుగా మరో కీలక శాఖ అప్పగిస్తారని చెబుతున్నారు. ఈ మధ్యాహ్నం అజారుద్దీన్ శాఖ పైన అధికారికంగా ఉత్తర్వుల ను జారీ చేయనున్నారు. ఇప్పుడు కేబినెట్ లో మరో రెండు బెర్తులు ఖాళీ ఉన్నాయి. డిసెంబర్ లో పూర్తి స్థాయిలో మంత్రివర్గ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరి మంత్రి పదవులకు ఉద్వాసన.. మరి కొందరికి అవకాశం.. శాఖల మార్పు ఖాయంగా కనిపిస్తోంది.