Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 31( కొత్తగూడెం నియోజకవర్గం )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని గిరిప్రసాద్ కాలనీకి చెందిన వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిన కేసులో నిందితుడికి జైలు శిక్షను కోర్టు విధించింది.కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కె. కిరణ్ కుమార్ శుక్రవారం ఈ తీర్పును వెల్లడించారు.కేసు వివరాల ప్రకారం — గిరిప్రసాద్ కాలనీలో నివసించే మునుగుపాటి మంగమ్మ తన భర్త రాంబాబు, కోటమ్మ, గోరంట్ల లక్ష్మీనారాయణల మధ్య జరిగిన అక్రమ సంబంధాల వివాదం నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోటమ్మతో తన భర్త రాంబాబు వివాదం జరిగి, ఆగ్రహంతో గోరంట్ల లక్ష్మీనారాయణ 2019 జూన్ 24న మధ్యాహ్నం రాంబాబు పై దాడి చేసి కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో రాంబాబు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందాడు.
మంగమ్మ ఫిర్యాదు మేరకు చుంచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తిచేసి కోర్టుకు చార్జిషీట్ సమర్పించారు. కోర్టు విచారణలో 9 మంది సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్న అనంతరం, నిందితుడు గోరంట్ల లక్ష్మీనారాయణపై నేరం రుజువైందని తేల్చి, మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా, చెల్లించలేని పక్షంలో మరో మూడు నెలల జైలు శిక్ష విధించింది.
అయితే, సహనిందితురాలు పునుగుపాటి కోటమ్మపై నేరం రుజువు కాలేదని కేసును కొట్టి వేసింది.
ఈ కేసులో ప్రభుత్వ తరఫున కారం రాజారావు ప్రాసిక్యూషన్ నిర్వహించారు. దర్యాప్తు, కోర్టు పనిలో ప్రస్తుత లక్ష్మీదేవిపల్లి ఎస్సై జి. రమణారెడ్డి, కోర్టు నోడల్ ఆఫీసర్ డి. రాఘవయ్య, కోర్టు లైజాన్ ఎం. శ్రీనివాస్, పి.సి.ఎస్. అశోక్‌లు సహకరించారు.