Listen to this article

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, (భండా రామ్), చీమకుర్తి, జనవరి 31 (జనం న్యూస్):

అయ్యే రామ అనే శీర్షికన ప్రమాదంలో రామతీర్థం అని గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. కర్నూలు నుంచి గేట్ల బిగింపులో ప్రత్యేక నైపుణ్యం ఉన్న సిబ్బందిని హుటాహుటిన జలాశయం వద్దకు రప్పించి రోజంతా శ్రమించి ఒక గేటుకు తాత్కాలికంగా మరమ్మతులు నిర్వహించారు. ఆయకట్టు పరిధిలో పంటలకు సాగునీరు అత్యవసరమైన దశలో అధికారులు రిస్క్‌ తీసుకోకుండా 350 క్యూసెక్కుల ప్రవాహం ఒక గేటు ద్వారా నిరంతరం దిగువకు ప్రవహించేలా ఏర్పాటు చేశారు. దీంతో పలు మేజర్ల కింద వరి, పొగాకు, మొక్కజొన్న తదితర పంటలను సాగుచేసిన రైతులకు ఈ సీజన్‌కు ఢోకా లేకుండా సరిపడా సాగునీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇరిగేషన్‌ ఈఈ రామకృష్ణ, డీఈ గిరిబాబు, ఏఈ పవన్‌, సాయిచరణ్‌, డబ్ల్యూఐ మల్లికార్జున మరమ్మతుల పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. జలాశయం వద్దకు చీమకుర్తి-2 డీసీ అధ్యక్షుడు పాలడుగు వెంకటనారాయణ, దర్శి-2 డీసీ అధ్యక్షుడు వెలుగొండారెడ్డి, చీమకుర్తి మేజర్‌ ప్రెసిడెంట్‌ గొగినేని శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు ఆయకట్టు రైతులు జలాశయం వద్దకు చేరుకొని గేటు మరమ్మతులో అధికారులకు సహకరించారు. గేట్లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు నిర్వహించటానికి ప్రతిపాదించిన రూ.45లక్షలు మంజూరైతే శాశ్వతప్రతిపాదికన పనులు చేపట్టనున్నట్లు ఈఈ రామకృష్ణ రైతులకు తెలిపారు.