Listen to this article

జనం న్యూస్ 01 ఫిబ్రవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా

శుక్రవారం ఐ.డి.ఓ.సి కాన్ఫరెన్స్ హాల్ నందు ఫిబ్రవరి 10న నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నులిపురుగుల నిర్మూలన కోసం పిల్లలందరికీ అల్బండజోల్‌ 400 ఎంజీ మాత్రలను వేయించాలని సూచించారు. ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల లోపు పిల్లలకు సగం టాబ్లెట్, రెండు నుండి మూడు సంవత్సరాల పిల్లలకు ఒక టాబ్లెట్ బాగా నూరి మీకు చాలా అన్నారు. మూడు నుండి 19 సంవత్సరాల వరకు గల పిల్లలకు ఒక టాబ్లెట్ మింగించాలని తెలిపారు. జిల్లాలో 1-19 వయస్సు గల చిన్నారులు, విద్యార్థులు ఒక లక్ష 62 వేల మంది ఉన్నారని పేర్కొన్నారు. పరిశుభ్రత పాటించకపోవడం వల్లనే నులిపురుగులు వస్తాయని, కావున హైజీన్ పాటించటం ఎంతో అవసరమని అన్నారు. మాత్రలు ఇంటికి తీసుకెళ్లకూడదని స్పష్టం చేస్తూ, పిల్లలకు మాత్రలు ఆ సమయంలోనే ఇవ్వాలని ఆదేశించారు.1 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరేళ్లు నిండి 19 ఏళ్లు వయస్సు గల వారికి పాఠశాలలు, కళాశాలలో మందును పంపిణీ చేయాలని ఆదేశించారు. జిల్లా సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడి కేంద్రాలలో మాత్రల పంపిణీ సజావుగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.మాత్రల వల్ల ఏదైనా దుష్ప్రభావాలు కనిపించినట్లయితే, వెంటనే వైద్యపరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. చిన్న పిల్లలకు మాత్రలు ఇచ్చే సమయంలో వాటిని సురక్షితంగా పౌడర్ చేసి, తగిన జాగ్రత్తలతో అందించాలని స్పష్టం చేశారు. విద్యాశాఖ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి పాఠశాలలలో ఈ కార్యక్రమాన్ని సమర్థ సొంతంగా నిర్వహించాలని తెలిపారు. అన్ని మండల విద్యాధికారులు తమ పరిధిలోని పాఠశాలలకు మాత్రలు అందినట్లు ధృవీకరించేందుకు డిక్లరేషన్ ఫారం సమర్పించాలని ఆదేశించారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం గురించి ప్రజలకు ముందుగా సమాచారం అందించాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమాన్ని సమన్వయంతో పర్యవేక్షించి, పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు బాధ్యతగా అందించాలని సూచించారు. అనంతరం శిశు మరణాలపై సమీక్ష నిర్వహించి మరణాలకు గల కారణాలు, విశ్లేషణను పరిశీలించారు. ధరూర్, గట్టు, క్యాథూర్ ప్రాంతాల్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు గుర్తించి, ఈ మూడు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.శిశు మరణాలను తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టి నివేదికను స్పష్టంగా సమర్పించాలని అధికారులకు సూచించారు. అలాగే, నివారించగలిగిన, నివారించలేని మరణాల కారణాలను విశ్లేషించి, భవిష్యత్తులో ఒక్క శిశువు మరణించకుండా అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి సిద్ధప్ప, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వినోద్ కుమార్ , జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సునంద, మెడికల్ ఆఫీసర్స్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.జారీ చేయువారు:-జిల్లా పౌర సంబంధాల అధికారి,జోగులాంబ గద్వాల జిల్లా