Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 13 – 11- 2025

అరెస్టు అయిన నిందితుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించే దిశగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం.. ఎలాంటి నేరం కింద అరెస్టు చేసినా సరే, ఎలాంటి మినహాయింపులు లేకుండా అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా, నిందితుడికి అర్థమయ్యే భాషలోనే తెలియజేయాలని స్పష్టం చేసింది.రాజ్యాంగంలోని అధికరణం 22(1) ప్రకారం.. అరెస్టు చేసిన వ్యక్తికి అరెస్టు కారణాలు సాధ్యమైనంత త్వరగా తెలియజేయాలనే అంశాన్ని ఈ తీర్పు బలంగా సమర్థించింది.జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ 52 పేజీల తీర్పులో.. “ఇది ఏదో లాంఛనప్రాయంగా పాటించాల్సిన విధానం కాదు. ఇది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక రక్షణ” అని స్పష్టం చేశారు. ముఖ్యంగా తనను ఎందుకు అరెస్టు చేశారో, తనపై మోపిన నేరారోపణల స్వభావం ఏమిటో నిందితుడికి తెలియాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది.ఈ జ్ఞానం మాత్రమే నిందితుడు న్యాయ సహాయం కోసం ప్రయత్నించడానికి, తనపై వచ్చిన ఆరోపణలకు తగిన విధంగా ప్రతిస్పందించడానికి వీలు కల్పిస్తుంది.
రిమాండ్‌కు 2 గంటల ముందు గడువు సాధారణంగా అరెస్టు సమయంలోనే లిఖితపూర్వక కారణాలు ఇవ్వడం తప్పనిసరి. అయితే ప్రత్యేక పరిస్థితుల కారణంగా అరెస్టు సమయంలో కారణాలు తెలియజేయడం సాధ్యం కాకపోతే.. వాటిని రిమాండ్‌ కోసం న్యాయమూర్తి ఎదుట నిందితుడిని హాజరు పరచడానికి కనీసం రెండు గంటల ముందుగానైనా లిఖిత పూర్వకంగా అందజేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ఈ గడువును పాటించడంలో విఫలం అయితే.. ఆ అరెస్టును, నిందితుడి రిమాండ్‌ను చట్టవిరుద్ధ చర్యగా పరిగణించే అవకాశం ఉంటుందని పేర్కొంది.ఈ తీర్పు ముంబయిలో 2024లో జరిగిన బీఎండబ్ల్యూ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో నిందితుడు మిహిర్‌ రాజేశ్‌ షా దాఖలు చేసిన అప్పీలుపై వెలువడింది. తన అరెస్టుకు గల కారణాలను రాతపూర్వకంగా ఇవ్వలేదనే కారణంపై షా తన అరెస్టు చట్టబద్ధతను సవాలు చేశారు.
సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ చారిత్రక తీర్పు అమలు కోసం, దీని ప్రతులను అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరళ్లకు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించాలని సుప్రీం కోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.