Listen to this article

జనం న్యూస్:- సోషల్ మీడియాలో పాపులర్‌ అవ్వాలని చాలామంది యువకులు ఎక్కడపడితే అక్కడ రకరకాల వీడియోలు చేస్తారు. ఈ మధ్యకాలంలో నడిరోడ్డుపై బైకులపై యువతీ యువకులు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ వీడియోలు తీసిన ఘటనలు నెట్టింట చూశాం. తాజాగా ఓ యువకుడు రీల్స్‌ కోసం రైల్లో చేసిన పనికి రైల్వే అధికారులు అతనిపై చర్యలు చేపట్టారు. అతని యూట్యూబ్‌ ఛానల్‌ నుంచి ఆ వీడియోను తొలగించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మోత్ పట్టణానికి చెందిన ప్రమోద్‌ శ్రీనివాస్‌ అనే యువకుడు నవంబరు 1న ఆగ్రా వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. అక్కడ ఓ జనరల్ టికెట్‌ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత రైల్వే స్టేషన్‌లోని యార్డ్‌లో నిలిచి ఉన్న రైలులోకి ప్రమోద్ శ్రీనివాస్ ఎక్కాడు. ఒక స్లీపర్‌ కోచ్‌లో కొద్ది మంది ప్రయాణికులే ఉండటంతో అక్కడ రీల్‌ చేద్దామని ప్రయత్నించాడు. ఒక బకెట్‌లో నీళ్లు తెచ్చుకున్నాడు. కంపార్ట్‌మెంట్‌ డోర్‌ వద్ద స్నానం చేశాడు. తలకు షాంపు రుద్దుకొని మగ్గుతో నీళ్లు పోసుకున్నాడు. రీల్‌ రికార్డ్‌ చేసిన తర్వాత ఆ రైలు దిగి, ఆగ్రా వెళ్లే రైలు ఎక్కాడు. రైలు కోచ్‌లో స్నానం చేసిన వీడియోను అతడి యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవడంతో రైల్వే అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో రైల్వే స్పందించింది. స్లీపర్‌ కోచ్‌లో స్నానం చేసిన యువకుడిని రైల్వే పోలీసులు గుర్తించారు. అతడిపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు రైల్వే పేర్కొంది. ఆ యువకుడు తన చర్యలకు క్షమాపణ చెప్పాడని, యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ వీడియో తొలగించినట్లు వెల్లడించింది. రైళ్లలో ఎవరూ ఇలాంటివి చేయవద్దని రైల్వే సూచించింది.