జనం న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం
మండలం నవంబర్ 14మైలవరంలో ఉద్రిక్తత యువకుడి మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని మృతుని బంధువులు శుక్రవారం సాయంత్రం జాతీయ రహదారిపై ఆందోళన చేయడంతో మైలవరం లో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకెళ్తే జి కొండూరు మండలం కె.కండ్రికకు చెందిన మిక్కిలి రవి మరియమ్మ దంపతులకు మిక్కిలి సమీర్ (20) కుమారుడు, కుమార్తె కలరు. నిరుపేద కుటుంబం కావడంతో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. రవికి మరో ఇద్దరు సోదరులు కలరు.మూడు కుటుంబాలకు సమీరే వారసుడు. శుక్రవారం ఉదయం సమీర్ తన బాబాయ్ పాపారావుతో కలిసి పనులు నిమిత్తం ద్విచక్ర వాహనంపై ఈదర వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో గణపవరం శివారు గణపతి గట్టు వద్ద ద్విచక్ర వాహనాన్ని పశువుల ఎరువు లోడుతో వెనుకవస్తున్న ట్రాక్టర్ ఢీకొనటంతో ట్రాక్టర్ వైపురహదారిపై సమీర్ పడ్డాడు. ట్రాక్టర్ ట్రక్కు టైరు సమీర్‌పై ఎక్కటంతో అక్కడకక్కడే మృతి చెందాడు. స్థానికులు గాయపడిన పాపారావును మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు మృతి చెందిన సమీర్ ను చూసి రోధిస్తుండటంతో పలువురిని కంటతడ పెట్టించాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోచంద్రాల గ్రామానికి చెందిన పెద్దలు మృతుని బంధువులతో రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు. రాజీ ప్రయత్నాలు ఫలించకపోవడంతో మృతుని బంధువులు ముందుగా జాతీయ రహదారి తిరువూరు బైపాస్ రింగ్ వద్ద ఆందోళన చేపట్టారు. మైలవరం సిఐ దాడి చంద్రశేఖర్, ఎస్సై సుధాకర్‌లు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని బలవంతంగాపోలీస్ స్టేషన్‌కు తరలించారు. మైనర్లకు ట్రాక్టర్లు ఇచ్చి మనుషులను చంపుతారా, కేసు నమోదు చేసిన ఎందుకు అరెస్టు చేయలేదని మృతుని బంధువులు నినాదాలు చేశారు.మాకు న్యాయం చేయమంటే పోలీసులు మమ్మల్ని అరెస్టు చేయటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కొంత సమయం తర్వాత మృతుని బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై మరల ఆందోళన చేపట్టారు. బలవంతంగా పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని తరలిస్తున్న సమయంలో పోలీసులకు మృతుని కుటుంబ సభ్యులకువాదోపవాదాలు జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు తమపై కఠినంగా వ్యవహరిస్తున్నారని బాధితులు నినాదాలు చేశారు. గంటకు పైగానే జాతీయ రహదారిపై ఆందోళన జరిగింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. యువకుడి మరణానికి కారణమైన వారిని అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.



