Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్

జనం న్యూస్ 15 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్

అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ రైట్స్ ఫోరం మరియు ఎపి ప్రో చైల్డ్ గ్రూపు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన వాల్ పోస్టరును విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జిల్లా పోలీసు కార్యాలయంలో నవంబరు 14న ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా బాలల హక్కులను పరిరక్షించే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. బాలలు స్వేచ్ఛగా జీవించేందుకు, రక్షించేందుకు, అభిప్రాయం వ్యక్తం చేసేందుకు, విద్యను అభ్యసించేందుకు, ఆహారం, ఆరోగ్యం, విశ్రాంతి పొందేందుకు హక్కులను ప్రసాదించిందని, వాటిని పరిరక్షించే బాధ్యత పోలీసుశాఖతోపాటు ప్రజలందరిపైనా ఉందన్నారు. ప్రతీ పోలీసు స్టేషనుల్లో ఒక సబ్ ఇన్స్పెక్టరు స్థాయి అధికారి బాలల హక్కులను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నారు. బాలలు లైంగిక వేధింపులకు గురికాకుండా వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, ఇందుకు ఎవరు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్య వివాహాలకు కారకులైన తల్లిదండ్రులు, పెద్దలు, వివాహాన్ని ప్రోత్సహించిన వారిపైనా చట్టరీత్యా చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ అన్నారు.డిస్ట్రిక్ట్ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ అధ్యక్షులు పి.చిట్టిబాబు మాట్లాడుతూ అంతర్జాతీయ ఐక్య సమితి 1991సం. లో జరిగిన బాలల హక్కుల ఒడంబడికతో బాలలకు 56 హక్కులు కల్పించబడ్డాయని, అందుకు అనుగుణంగా బాలల రక్షణకు అనేక చట్టాలు తీసుకురాబడ్డాయన్నారు. ముఖ్యంగా బాలలు జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు భాగస్వామిగా హక్కులు అమలు చేయడంతో బాలల భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిద్దివచ్చనన్నారు.18సం.లోపు బాలల హక్కులు ఎవరైనా ఉల్లంఘించినా, బాల కార్మికులుగా ఎవరైనా కనిపించినా, బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్లు 1098, 100కు అందించాలని లేదా బాలల సంక్షేమ సమితి బెంచ్ సభ్యులను సంప్రదించవచ్చునన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డిస్ట్రిక్ట్ చైల్డ్ రైట్స్ ఫోరం కన్వీనరు పి.చిట్టిబాబు, డి.వి.ఎం.సి. సభ్యులు రాము, డాన్ బాస్కో ప్రతినిధి ఇంద్రజిత్తు గుప్తా, డి.బి.ఎన్.యు. కార్యదర్శి ఎం.పి.రాజు, ట్రైబల్ రైట్స్ ఫోరం అధ్యక్షులు నర్సింహ దొర, క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు జాన్ కెన్నెడీ, డి.బి.ఎస్.యు. ప్రతినిధులు వై.పోలయ్య, గొల్ల బాబు, శ్రీనివాస్ చైల్డ్ రైట్స్ రెస్పాన్స్ సొసైటీ రపతినిధి పీరుబండి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.