ఎస్‌ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశం
జనం న్యూస్ సెప్టెంబర్ 19:నిజామాబాద్ జిల్లాఏర్గట్ల
మండలకేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాలలో బిల్లులు సకాలంలో జమ కావడానికి ట్యాబ్ ఎంట్రీలను వెంటవెంటనే పూర్తిచేయాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఏర్గట్ల మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి దరఖాస్తుల పరిష్కారం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) సన్నాహక ప్రక్రియ అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు.కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం పరిమాణం, మిల్లులకు తరలించిన లారీ లోడ్ల సంఖ్య, ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం, వరి కోతల పురోగతి వంటి వివరాలను కలెక్టర్ అధికారులు నుండి తెలుసుకున్నారు. మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే ట్రక్ షీట్లు తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ఎంట్రీలన్నీ అదే రోజు పూర్తిచేయాలని స్పష్టం చేశారు.తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఎస్‌ఐఆర్ సన్నాహక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. 2002, 2025 ఓటరు జాబితాల మ్యాపింగ్‌లో ఎలాంటి తప్పిదాలు ఉండకూడదని, పోలింగ్ కేంద్రాల వారీగా మళ్లీ క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని, సాదాబైనామా అర్జీలను తిరస్కరిస్తే కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు.కలెక్టర్ వెంట తహసీల్దార్ మల్లయ్య, స్థానిక అధికారులు పాల్గొన్నారు.



