జనం న్యూస్ 20 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ
పట్నాయక్విజయనగరం జిల్లా ఎస్. కోటలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన యువ సమ్మేళనం కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ ముఖ్య అతిధిగా హాజరై, యువతతో మమేకమయ్యారు. శ్రీ సత్యసాయి దివ్యామృతం మరియు రాంకీ ఫౌండేషను ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమ నిర్వాహకులు జిల్లా ఎస్పీకి సాదరంగా స్వాగతం పలికగా, జిల్లా ఎస్పీ జ్యోతి ప్రజ్వలనం చేసి, కార్యక్రమంను ప్రారంభించారు.జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ మాట్లాడుతూ – విద్య, వైద్యం అందించడంతోపాటు ప్రజలకు పలు సేవా కార్యక్రమాలను సత్యసాయి బాబా చేపట్టి, శ్రీ సత్యసాయిబాబా అందరి మనస్సులో చిరస్థాయిగా నిలిచారన్నారు. అదే స్ఫూర్తితో ఎస్.కోట ప్రాంతంలో కేన్సర్ ఆసుపత్రి నిర్మాణంను శ్రీ సత్యసాయి దివ్యామృతం వ్యవస్థాపకులైన స్వామి చేపట్టడం వలన ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు సాంకేతికంగా వచ్చే మార్పులను గమనిస్తూ, అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. క్రమశిక్షణతో విద్యార్థులు విద్యను అభ్యసించి, ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. విద్యార్ధులు తమ నైపుణ్యాలను మెరుగువర్చుకొని, తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానాలకు ఎదిగి, మంచి విజయాలను సాధించాలన్నారు. యువత క్రొత్త క్రొత్త రంగాల్లో అడుగుపెట్టి, రాబోయే తరాలకు బంగారు బాటలు వేయాలన్నారు. సైబరు మోసాలకు గురికాకుండా ప్రతీ ఒక్కరూ టెక్నాలజీ పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. చదువుకొనే సమయంలో విద్యార్థులు చెడు మార్గంలో పయనించకుండా లక్ష్య సాధన వైపు నడవాలన్నారు. మద్యం, గంజాయి వంటి అలవాట్లకు లోను కావద్దన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం కావద్దని యువతను కోరారు. డిజిటల్ అరెస్టు, సైబరు నేరాలు పట్ల అవగాహన పెంచుకొని, మీ ప్రాంతంలో ఉండే పెద్దలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని యువతకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి దివ్యామృతం వ్యవస్థాపకులు స్వామి, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ముర్రు ముత్యాలనాయుడు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సిఈఓ రవి ఈశ్వరపు, రామగోపాల్, శ్రీకాంత్, రాజు, పావని, విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు, ఎస్.కోట సిఐ వి.ఎన్. మూర్తి మరియు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.


