దుమ్ముతో వాహనదారులు, చెత్తతో కాలనీవాసులు ఇబ్బందులు
జనం న్యూస్ నవంబర్ 21 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కాలనీల్లో శుభ్రత పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని కాలనీవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీలోకి మారిన ఈ ప్రాంతాల్లో, రోడ్ల శుభ్రతపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో ఆగ్రహానికి దారితీస్తోంది.రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతున్న తరుణంలో కొత్తగా ఏర్పడుతున్న కాలనీల్లో బిల్డర్ల వద్ద డబ్బులు వసూలు చేయడమే తప్ప, మౌలిక సదుపాయాల పరిరక్షణపై అధికారులు శ్రద్ధ చూపడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెత్త సకాలంలో తొలగించకపోవడం, డ్రైనేజీలు మూసుకుపోవడం, దుర్వాసనతో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయని వారు తెలిపారు.ఇంకా, ఇంద్రేశం ప్రధాన రహదారి గుండా ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తున్నప్పటికీ రోడ్లను శుభ్రం చేయకపోవడం వల్ల టూవీలర్లు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై పేరుకుపోయిన దుమ్ము టూవీలర్ ప్రయాణికుల కళ్లలో చేరి అసహనానికి గురిచేస్తోందని వాహనదారులు వాపోతున్నారు.ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రోడ్ల శుభ్రత, చెత్త సేకరణ, డ్రైనేజీల నిర్వహణ వంటి కార్యక్రమాలపై మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు, వాహనదారులు కోరుతున్నారు.


