. జనం న్యూస్ నవంబర్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం
ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు…
. భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండల కేంద్రంలో హన్మకొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై, ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. మహిళల అభ్యున్నతికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ధృడ సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా, తప్పిదాలు, లోటుపాట్లకు తావులేకుండా ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ అయ్యేలా పారదర్శకంగా, ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఆడబిడ్డలకు చీర, సారె పెట్టడం మన సంప్రదాయమని అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అద్దె బస్సులకు వారిని యజమానులను చేశామని అన్నారు. స్కూల్స్ యూనిఫాం లు కుట్టే బాధ్యతను కూడా మహిళా సంఘాలకే అప్పగించామని తెలిపారు రాష్ట్రంలో మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ఆన్‌లైన్ మార్కెటింగ్ కోసం అమెజాన్‌తో కూడా సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు. వరి ధాన్యం కొనుగోళ్లలో కూడా మహిళలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. కుటుంబ అభ్యున్నతిలో మహిళలే కీలకమని, భవిష్యత్ తరాల బాగు కోసం పిల్లలను చక్కగా చదివించాలని ఎమ్మెల్యే హితువు పలికారు.ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 18 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు రూ.5,23,000 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నేతలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


