Listen to this article

శాంతి చర్చలకి వచ్చిన మావోయిస్టులను చంపడం దుర్మార్గం

మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ల పై న్యాయ విచారణ జరపాలి – సిపిఐ డిమాండ్

భూటకపు ఎన్‌కౌంటర్ల నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. కామేశ్వరరావు

జనం న్యూస్‌ 24 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపాలనే ఉద్దేశంతో వచ్చిన మావోయిస్టు నేతలను ఆసుపత్రి నుండి తీసుకెళ్ళి ఎన్‌కౌంటర్‌ పేరిట చంపటం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. కామేశ్వరరావు ధ్వజమెత్తారు.
అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్ల పై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ, భూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా రాష్ట్ర వ్యాపితంగా భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా విజయనగరం నియోజకవర్గ కార్యదర్శి బుగత అశోక్ నేతృత్వంలో ఆదివారం ఉదయం స్థానిక అంబెడ్కర్ జంక్షన్లో అంబెడ్కర్ విగ్రహం ముందు జరిగిన నిరసన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. కామేశ్వరరావు మీడియాలో మాట్లాడుతూ మారేడుమిల్లి ఏజన్సీలో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు 13 మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు ప్రకటించిన విషయం గుర్తు చేశారు. అయితే చికిత్స కోసం నగరాలకు వచ్చి తలదాచుకున్న మావోయిస్టులను పట్టుకుని అడవుల్లోకి తీసుకెళ్లి ఎదురుకాల్పుల పేరిట పోలీసులు కాల్చి చంపడం దుర్మార్గమని విమర్శించారు. విజయవాడ, ఏలూరు, ఇతర ప్రాంతాలలో నిర్బంధించిన మావోయిస్టులను, అమాయక గిరిజనులను వెంటనే న్యాయస్థానాల ముందు హాజరు పరచాలని డిమాండ్ చేశారు. 2026 మార్చి 31 కి మావోయిస్టు రహిత ప్రాంతంగా మారుస్తామని, ఆపరేషన్ కగార్ లో అంతర్భాగంగా మోడీ, అమిత్ షా లు నర మేధానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులను భయాందోళనకు గురి చేసి అడవుల నుంచి ఖాళీ చేయించి అటవీ సంపదను అదాని, అంబానీలకు దోచిపెట్టడానికే ఆపరేషన్ కగార్ పేరుతో మోడీ, అమిత్షాలు చేయిస్తున్న భూటకపు ఎన్‌కౌంటర్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంపు చెప్పగానే శత్రు దేశమైన ఆపరేషన్ సింధూర్ ఆపేసిన మోడీషాలకు మావోయిస్టులు ఎన్నో ఏళ్ళ నుంచి శాంతి చర్చలు కోరుకుంటున్న కూడా మీకు వినపడలేదా అని మండిపడ్డారు. ఇప్పటికైనా మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపించి ఈ భూటకపు ఎన్‌కౌంటర్లను ఆపాలని, మారేడుమిలి భూటకపు ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని సిపిఐ డిమాండ్ చేస్తుందని తెలిపారు.సిపిఐ విజయనగరం నియోజకవర్గ కార్యదర్శి బుగత అశోక్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో సమితి సభ్యులు పొందూరు అప్పలరాజు, వడ్డాది కొండలరావు, ఎ.ఐ.ఎస్.ఎఫ్ గౌరీ శంకర్, ఎ.ఐ.వై.ఎఫ్ బూర వాసు, విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ సయ్యద్ ఇబ్రహీం, అగ్రిగోల్డ్ ఎజెంట్స్ అండ్ కస్టమర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఇ. వి. నాయుడు, జిల్లా అధ్యక్షులు మజ్జి సూరప్పడు మరియు కార్మికులు పాల్గొన్నారు.