టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ( స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు ఈరోజు కళాశాల విద్యాశాఖ, ఆంధ్ర ప్రదేశ్ వారి సహకారంతో, అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూర్ వారి సౌజన్యంతో కళాశాల విద్యార్థులకు వర్చువల్ లాబరేటరీ ప్రయోగాల వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది.వర్చువల్ ల్యాబ్ అనేది కంప్యూటర్ ఆధారిత సిమ్యులేషన్. ఇది విద్యార్థులు భౌతిక పరికరాల అవసరం లేకుండా డిజిటల్ ఇంటర్ఫేస్ ద్వారా ఆన్లైన్లో ప్రయోగాలు చేసే విధానం. ఈ వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌లు శాస్త్రీయ మరియు సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడానికి, సాధన చేయడానికి మరియు ఎలాంటి ఖర్చులేకుండా ప్రయోగాలను వర్చువల్ పద్ధతిలో చేసుకోవడానికి ఉపకరిస్తుంది.అమృత విశ్వ విద్యాపీఠంకు చెందిన ప్రొఫెసర్ పిఎఫ్ సనీష్ మరియు రీసెర్చ్ అసోసియేట్ ఎన్. నిజిన్ ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన భౌతిక, రసాయన, జంతు మరియు వృక్ష శాస్త్ర విద్యార్థిని విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా ప్రాక్టికల్స్ ను ఈ వర్క్ షాప్ లో సులువైన పద్ధతిలో నేర్పించడం జరిగింది. అత్యంత ఖరీదైన స్పెక్ట్రో ఫోటో మీటర్ లాంటి పరికరాలను వర్చువల్ గా చూపిస్తూ, వాటితో ప్రయోగాలను చేయించడం ఈ యొక్క వర్క్ షాప్ ప్రత్యేకత. జంతు శాస్త్రంలో ఎలుక, కప్ప డిసెక్షన్, బ్లడ్ గ్రూపింగ్, రసాయన శాస్త్రంలో ఎలక్ట్రో కెమిస్ట్రీ ప్రయోగాలు తదితర అంశాలను విద్యార్థులకు సులువుగా కళ్ళకు కట్టినట్లుగా అర్థమయ్యే విధంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంచి అవకాశాన్ని తమ కళాశాలకి అందించిన కళాశాల విద్యాశాఖకు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రవి కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులకు సులువుగా ప్రయోగాలు చూపించిన అమృత విశ్వవిద్యాలయ ప్రొఫెసర్స్ కు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అమృత వర్చువల్ ల్యాబ్స్ కో- ఆర్డినేటర్ శ్రీ వివి. కృష్ణ శర్మ, భౌతిక శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ ఎన్వి. శ్రీహరి, రసాయన శాస్త్ర అధ్యాపకులు శ్రీ బి. కమల బాబు, డాక్టర్ కె వి పద్మావతి, డాక్టర్ కే.జయ ప్రశాంతి, వృక్ష శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ ఎన్ తిరుపతి స్వామి, శ్రీ బాలు నాయక్, జంతు శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ ఐ. అనూష, ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


