Listen to this article

జనం న్యూస్ 26 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

జోగులాంబ గద్వాల జిల్లాలో బాలికల భద్రతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గద్వాల్ షీ టీమ్ అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో గద్వాల పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపులు, పబ్లిక్ ప్రదేశాలలో ఎదురయ్యే ప్రమాదాలు, వాటిని ఎలా గుర్తించాలి, వాటినుంచి ఎలా రక్షించుకోవాలి అనే అంశాలపై విద్యార్థులకు సవివరంగా వివరించారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, స్కూళ్లు, కళాశాలలు వంటి జనసంచార ప్రాంతాల్లో మహిళలను వేధించే వ్యక్తులను గుర్తించడంలో షీ టీమ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
వేధింపులకు గురయ్యే సందర్భంలో విద్యార్థులు ఎటువంటి సంకోచం లేకుండా వెంటనే షీ టీమ్ హెల్ప్‌లైన్ 8712670312 ను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఇట్టి విధముగా కాల్ చేసిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాము అని తెలిపారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని, ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకున్నట్లు షీ టీమ్ తెలిపింది.జిల్లా పోలీస్ శాఖ బాలికలు, మహిళల భద్రత, గౌరవ పరిరక్షణను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు భవిష్యత్తులో మరింతగా విస్తరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో షీ టీం ఎస్సై ఎం. తేజస్విని, కానిస్టేబుల్ దివ్య వాణి, కాలేజీ ప్రిన్సిపాల్ పార్వతి, ఇతర అధ్యాపకులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.