జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
(జనం న్యూస్ 26 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి)
తెలంగాణ రాష్ట్రంలో 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో అదనపు ఎన్నికల అధికారి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, నోడల్ అధికారి శంకర్ లతో కలిసి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు పంచాయతీ ఎన్నికల నిర్వహణ, నామినేషన్ ప్రక్రియపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ పంచాయితీ ఎన్నికల ప్రకటన విడుదల అయినందున తదనగుణంగా ఎన్నికల నిర్వహణలో అధికారులకు అవసరమైన శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్ ప్రక్రియ నుండి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్, నామినేషన్ల పరిశీలన, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, ఫోటో ఓటర్ స్లిప్పుల పంపిణీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ ప్రక్రియ, ఫలితాలు వంటి ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించిన పత్రాలను ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి క్షుణ్ణంగా పరిశీలించాలని, నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చే నామినేషన్లను తీసుకోకూడదని, రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. నామినేషన్లు పరిశీలించి అర్హులు, అనర్హుల జాబితాలో పూర్తి వివరాలతో రూపొందించాలని, ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలని తెలిపారు. ఎన్నికల గుర్తుల కేటాయింపులు జాగ్రత్త వహించాలని, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్ తయారీలో నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ 50 రూపాయల కంటే తక్కువగా ఉండకూడదని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు అవసరమైన సామాగ్రి జిల్లాలో అందుబాటులో ఉందని, అవసరం మేరకు వినియోగించుకోవాలని తెలిపారు. విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. నామినేషన్ల పరిశీలన, ఓట్ల లెక్కింపు అంశాలలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు. మాస్టర్ ట్రైనర్లతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి అనుమానాలు, అపోహలు ఉన్నా శిక్షణ సమయంలో నివృత్తి చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది


