

సిఐటియు లో చేరిన నాట్కో, మున్సిపాలిటీ కార్మికులు
జనం న్యూస్- ఫిబ్రవరి 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ :-
సిఐటియు కార్మికులు తమ హక్కుల సాధనలో, హక్కుల కోసం పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలని సిపిఎం పార్టీ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి వీరారెడ్డిలు పిలుపునిచ్చారు. ఆదివారం నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్, హిల్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక నాట్కో ఫార్మా కంపెనీకి చెందిన కార్మికులు, నందికొండ మున్సిపాలిటీ చెందిన కార్మికులు భారీ సంఖ్యలో సిఐటియు యూనియన్ లో సిఐటియు జిల్లా నాయకులు ఎస్. కె. బషీర్ ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా నాట్కో ,నందికొండ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను వారికి తెలియజేశారు. అనంతరం సిపిఎం పార్టీ మాజీ శాసన సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ నాట్కో ,మున్సిపాలిటీ కార్మికుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ప్రపంచం మొత్తం ఎర్రజెండా వైపు చూస్తుందని దేశంలో, రాష్ట్రంలో కార్మిక రాజ్యం రావాలని వాక్యానించారు. కార్మిక రంగాన్ని సంఘటిత పరిచి యూనియన్లను ఏర్పాటు చేసి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు పోరాటం చేసేదే సిఐటియు యూనియన్ అని, గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం చేసే సత్తా ఒక్క సీఐటీయూ యూనియన్ కే ఉందని ఆయన అన్నారు. అనంతరం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి వీరారెడ్డి మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం సిఐటియు పోరాటం చేస్తుందని, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మికుల పొట్టలు కొట్టి యాజమాన్యులకు లబ్ధి చేకూరేలా పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తెస్తుందన్నారు. కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని తుంగలో తొక్కి 12 గంటల పని విధానాన్ని అమలు చేయడానికి కేంద్రం సన్నిద్ధం అవుతుందన్నారు. సమాన పని సమాన వేతనం లాంటి సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం నిర్లక్ష్యం చేసి తక్కువ వేతనాలతో ఎక్కువ పనిని కేంద్రం ప్రోత్సహిస్తుందన్నారు. 78 ప్రభుత్వ శాఖలను ప్రైవేటీ కరణ చేసే విధంగా కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. ఎల్ఐసి ని విదేశీ సంస్థలకు అప్పజెప్పే విధంగా పన్నాగం పన్నుతుందన్నారు. ఉత్పత్తి చేసే కార్మిక రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు. పోరాడితే వచ్చేది హక్కు అని పోరాటం ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు. మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పాటు చేసినప్పుడే వాటి వనరులు కూడా సమకూర్చుకొని ఉంటే నందికొండ మున్సిపాలిటీలో నిధుల సమస్య ఉండేది కాదన్నారు .నందికొండ మున్సిపాలిటీ కార్మికుల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్మికుల ఐక్యతే సిఐటియు లక్ష్యం అన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్ రెడ్డి నాగిరెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ, సిఐటియు జిల్లా నాయకులు ఎస్ కె బషీర్, ఉపాధ్యక్షులు అవుతా సైదులు, చిరు నాగార్జున ,మల్లయ్య ,ప్రజానాట్యమండలి సభ్యులు చంద్రయ్య, నాగార్జునసాగర్ సిఐటియు నాయకులు బత్తుల గోవింద్, ఆనంద్ పాల్ ,రోశయ్య మరియు స్థానిక నాట్కో నందికొండ మున్సిపాలిటీ కార్మికులు పాల్గొన్నారు.