Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 2జహీరాబాద్ నియోజకవర్గం శాంతినగర్

ప్రాంతంలోని జెడ్పిహెచ్ఎస్ శాంతినగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకర స్థితిలో కొనసాగుతోంది. మొత్తం 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నా, సరైన తరగతి గదులు లేక ఉపాధ్యాయులు గ్రౌండ్‌లోనే విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు చెప్పాల్సి వస్తోంది. విద్యార్థులు ఎండ, వర్షం, చలి పరిస్థితుల్లోనూ బహిరంగ ప్రదేశంలోనే చదువుకోవాల్సి రావడం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.పాఠశాల ప్రాంగణంలో కాంపౌండ్ వాల్ కూడా లేకపోవడంతో విద్యార్థుల భద్రతకు తీవ్ర ప్రమాదం ఏర్పడిందని ఉపాధ్యాయులు తెలియజేశారు. పాఠశాల అభివృద్ధి కోసం అనేకసార్లు బాధ్యత గల అధికారులను కోరినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తమైంది.ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ కోట శివరాజ్ మాట్లాడుతూ— “విద్యార్థులు మంచి భవిష్యత్తు కోసం పాఠశాలకు వస్తున్నారు. అయితే గదుల కొరత కారణంగా పాఠాలు గ్రౌండ్‌లో చెప్పాల్సి వస్తోంది. కనీసం కాంపౌండ్ వాల్ కూడా లేని పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు తక్షణమే కొత్త తరగతి గదులను, కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టాలి” అని విజ్ఞప్తి చేశారు.స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాఠశాల అభివృద్ధికి ముందుకు రావాలని కోరుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.