కంపెనీ ఎదుట మృతుని కుటుంబ సభ్యుల ఆందోళన
జనం న్యూస్ డిసెంబర్ 2 సంగారెడ్డి జిల్లా,
పటాన్‌చెరు పారిశ్రామిక వాడలోని పార్కర్ పరిశ్రమలో ఒక కార్మికుడు మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. పెద్దకంజర్ల గ్రామానికి చెందిన కుమ్మరి కుమార్ (48) గా మృతుడిని పోలీసులు గుర్తించారు.ఉదయం షిఫ్ట్ డ్యూటీకి హాజరైన కుమార్, పనిచేస్తున్న సమయంలో అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లి కుప్పకూలినట్టు సమాచారం. వెంటనే స్పందించిన పరిశ్రమ యాజమాన్యం అతన్ని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు.మృతుడి కుటుంబ సభ్యులు, పెదకంజర్ల గ్రామస్తులు పరిశ్రమ గేటు వద్ద ఆందోళనకు దిగారు. కుమార్ మృతి విషయంలో యాజమాన్యం బాధ్యత వహించి, కుటుంబానికి తక్షణ నష్టపరిహారం ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రెండవ షిఫ్ట్ డ్యూటీకి వచ్చి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికులను కూడా బంధువులు గేటు వద్ద అడ్డుకున్నారు.ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా పటాన్ చేరు పోలీసులు పరిశ్రమ వద్దకు చేరుకుని పరిస్థితిని నియంత్రించారు.


