జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 2
గొల్లపల్లి గ్రామంలో మెట్టవరి సాగుచేసిన రైతులతో సహాయ వ్యవసాయ సంచాలకులు బాలాజీ నాయక్ గారు మరియు మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి పొలాలను పరిశీలించారు. మెట్టవరి సాగులో దుబ్బుకు సరాసరి 22 నుండి 24 పిలకలు గుర్తించారు. ఒక్కక్క కంకికి సుమారు 220 నుంచి 230 గింజలు ఉన్నట్లు రైతులకు లెక్కించి చూపించారు. తద్వారా ఎకరాకు 3 నుంచి 4 బస్తాలు అధికంగా పండుతాయి, రైతుకు ఆదాయం లభిస్తుందని తెలిపారు. కావున మెట్టవరి సాగు వలన దమ్ము ఖర్చు, నాట్లు వేసే ఖర్చు, కూలీల కొరత తగ్గించుకోవటంతో పాటు , ఎక్కువ దిగుబడి వలన రైతులకు అదనపు ఆదాయం పొందాలంటే, రైతులు తప్పనిసరిగా సాధారణ వరి నాట్లు పద్ధతి మాని, మెట్టవరి సాగు చేపట్టవలసిన ఆవశ్యకత ఉందని తెలిపారు. అనంతరం మొక్కజొన్న పరిశీలించారు. సీడ్ ప్రొడక్షన్ కోసం మొక్కజొన్న సాగుచేసే రైతులు కంపెనీ వారి వద్ద విధిగా అగ్రిమెంట్లు తీసుకోవాలని తెలిపారు. మినుము పంటలో ఇనుప ధాతు లోపాలను గుర్తించారు. భూమిలో అధిక తేమ ద్వారా, చలి వాతావరణం వలన కలిగే ఇనుప ధాతు లోపాలను సవరించుకోవటానికి ఫెర్రస్ సల్ఫేట్ 1గ్రా లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు. వారి వెంట ఏఈఓ దేవేంద్ర గౌడ్, గ్రామ వ్యవసాయ సహాయకులు గణేష్ సాగర్, గొల్లపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.



