జనం న్యూస్ 09 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
జిల్లా కలెక్టర్ ముస్తాబు కార్యక్రమానికి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కితాబు పలికారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఓ బి సి జిల్లా చైర్మన్ వంగల దాలినాయుడు, నియోజకవర్గ చైర్మన్ సిరిసిపల్లి సాయి శ్రీనివాస్, ఎస్సీ సెల్ చైర్మన్ కోలా కిరణ్ కుమార్, మండల అధ్యక్షులు తీళ్ళ గౌరీ శంకరరావు, సాలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ గేదెల రామకృష్ణ, కిసాన్ సెల్ నియోజకవర్గం ఇంచార్జ్ చొక్కాపు వెంకటరమణ, మండల ఇన్చార్జ్ బంకపల్లి ఉమామహేశ్వరరావు, ఎస్సీ సెల్ నాయకులు నిమ్మకాయలు చంటి తదితరులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డిని కలిసి జిల్లాలో చేపట్టిన ముస్తాబు కార్యక్రమాన్ని అభినందించారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ చేపట్టిన ముస్తాబు కార్యక్రమాన్ని మెచ్చుకొని, రాష్ట్రమంతటా అమలు చేస్తామని చెప్పటం ఆనందంగా ఉందన్నారు. అనతి కాలంలోనే జిల్లాపై పట్టు సాధించి, ఎదురైనా విపత్తులను సునాయిసంగా ఎదుర్కొని, జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తున్న జిల్లా కలెక్టర్ ను అభినందించారు. ఈ సందర్భంగా పుష్ప గుచ్చాన్ని అందజేసి, శాలువతో సత్కరించారు. ముఖ్యమంత్రి మన్ననలు పొందిన కలెక్టర్ ను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా నివేదిస్తున్న సమస్యలను పరిష్కరించి , తనదైన శైలిలో జిల్లాను ముందుకు నడపాలని కోరారు. అన్ని రంగాల్లో జిల్లాను ముస్తాబు చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు జిల్లాను వేధిస్తున్న పలు సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కోట్లాది రూపాయలు విలువైన చెరువులు, గెడ్డలు తదితర నీటి వనరులు ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయి అన్నారు. జిల్లాలో ఏనుగులు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయన్నారు. జిల్లాలోని దేవాలయాల ఆస్తులను వెలికి తీసి వాటిని రక్షించాలన్నారు. గత ఐదేళ్లుగా ఐటిడిఏ సమావేశాలు లేవని వాటిని నిర్వహించాలన్నారు. అంగన్వాడీల మొదలుకొని హాస్టల్ వరకు మెనూ సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు. విద్యాశాఖ పై దృష్టి సారించి రెగ్యులర్ డీఈఓ ను నియమించాలన్నారు. జిల్లా ఆసుపత్రికి స్పెషలిస్ట్ వైద్యులు వచ్చేలా చూడాలన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీ వేధిస్తున్న తాగునీరు చెత్త డంపింగ్ యార్డ్ సమస్యలను పరిష్కరించాలన్నారు. రోడ్లు మరమ్మతులు చేపట్టి రోడ్డు ప్రమాదాల నివారించాలన్నారు. జంఝావతితోపాటు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు. ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలన్నారు జిల్లాలో నాటు సారా, గంజాయి నిర్మూలించాలన్నారు. జిల్లాలో పారిశుధ్యం మెరుగుదలకు కృషి చేయాలన్నారు. జిల్లాలో జరుగుతున్న పశు అక్రమ రవాణాలను అరికట్టాలన్నారు. మట్టి, ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు. పార్వతీపురం మెయిన్ రోడ్డులో ఆక్రమణలు తొలగించాలన్నారు. జిల్లాను వేధిస్తున్న పలు సమస్యలను పరిష్కరించి అన్ని విధాలుగా జిల్లాను ముస్తాబు చేయాలని కోరారు. సందర్భంగా వినతిపత్రాన్ని అందజేశారు.


