జోగిపేట ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
11 మంది వైద్యులకు కి షోకాజ్ నోటిసులు జారీ
జనం న్యూస్ సంగారెడ్డి ,డిసెంబర్ 09
ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడితే సహించేది లేదని, నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించక తప్పదని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య హెచ్చరించారు.మంగళవారం జోగిపేట ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె హాజరు రిజిస్టర్ ను పరిశీలించగా,పలువురు వైద్యలు విధులకు హాజరు కాకపోవడం పై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన వైద్యులు ,సిబ్బంది వివరాలను, డిప్యూటేషన్‌పై ఉన్న సిబ్బంది వివరాలను కలెక్టర్ ఆరా తీసారు. విధులకు గైరుహాజరైన 11 మంది వైద్యులకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డి సి హెచ్ ఓ ను ఆదేశించారు.ఓపి, డయాలసిస్, ఐసియు తో సహా అన్ని విభాగాలను ఆమె పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవలు, పరికరాల వినియోగం, శుభ్రత, మందుల లభ్యత వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు .ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న కొంతమంది రోగులతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ … రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రులలో పేద ,మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా మెరుగైన వైద్య చికిత్సలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నామన్నారు. రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్యులు, వైద్య సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వైద్యవృత్తి ఎంతో పవిత్రమైనదని, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.కలెక్టర్ వెంట రెవెన్యూ డివిజనల్ అధికారి పాండు, తహసీల్దార్ మధుకర్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.


