జనం న్యూస్ 10 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
అయిజ:భారతీయ జనతా పార్టీ అయిజ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి, నాయకులు మరియు ప్రజలతో కలిసి, ప్రమాదకరంగా మారిన అయిజ–గట్టు ప్రధాన రోడ్డును పరిశీలించారు.అనంతరం కంపాటి భగత్ రెడ్డి మాట్లాడుతూ,జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ నుండి గట్టు వరకు వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి రోజు రోజుకు మరింత దారుణంగా మారుతోంది. రహదారి మొత్తం గుంటలతో నిండిపోయి, సాధారణ ప్రయాణం కూడా ప్రాణాలను పణంగా పెట్టినంత ప్రమాదకరంగా మారింది. ప్రత్యేకంగా టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు.ఈ దుస్థితి ఒక్కరోజులో రాలేదు. నెలలుగా ఈ మార్గాన్ని వాడే ఏక్లాస్పురం, దేవబండ, గొర్లఖాన్దొడ్డి, గట్టు మరియు కేటి దొడ్డి మండలం ప్రజలు పదేపదే చెప్పినా, సంబంధిత శాఖలు మరియు ప్రభుత్వం కేవలం నిర్లక్ష్యానికి మాత్రమే పరిమితం అయ్యాయి. వర్షాలు పడిన ప్రతిసారి ఈ రహదారి గుంటలు గంటలుగా మారి, చిన్నపాటి ప్రమాదాలు రోజువారీ వార్తలుగా మారాయి.ప్రజలు విద్య, వైద్యం, వ్యవసాయం, పనులు కోసం రాకపోకలు చేయాల్సిన ఇదొక ముఖ్యమైన ప్రధాన మార్గం. అయితే ప్రభుత్వం ఈ విషయం పట్ల కనీస బాధ్యత కూడా చూపకపోవడం చాలా బాధాకరం.పెద్ద సభల్లో అభివృద్ధి గురించి పొగడ్తలు చెప్పే కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు, ఒక్కసారి ఈ రహదారి మీద ప్రయాణించి చూడాలి.ప్రజలు పడుతున్న కష్టాలు అర్థమవుతాయి.ఇది రాజకీయాలు కాదు, ప్రజల ప్రాణ భద్రత గురించి.అందువల్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి,గుంటలు పూడ్చి, అర్ధసిద్ధమైన మరమ్మతులు చేసే పద్ధతిని మానుకుని,పూర్తిగా కొత్త రహదారి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలి.ప్రజలు అడుగుతున్నది ప్రత్యేక ప్రయోజనాలు కాదు, ప్రాథమిక హక్కు. బతికి ప్రయాణించే హక్కు అని అన్నారు.ఈ కార్యక్రమంలో అయిజ పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, బెల్లంకొండ నాగరాజు, ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు వీరయ్యచారి, లక్ష్మణాచారి, రవి కుమార్, ప్రకాష్, నర్సిరెడ్డి, రవి గౌడ్, నాగరాజు, వీరేష్, చెన్నప్ప తదితరులు పాల్గొన్నారు.


