జనం న్యూస్ 12 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ పంటల కొనుగోలులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వం పతనం ఖాయం అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. కామేశ్వరరావు హెచ్చరించారు.బుధవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ), ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై నిరసన తెలిపి డీఆర్‌ఓకి వినతిపత్రం సమర్పించారు. ప్రధాన ఆరోపణలు, సమస్యలు: * ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం: 50 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పి, కనీసం గోనె సంచులు కూడా అందించడంలో విఫలమైంది. * కొనుగోలులో కొర్రీలు: తేమ శాతం, ధాన్యం రంగు, రాళ్లు-రప్పలు పేరుతో కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. * దళారుల దోపిడీ: కొనుగోలు కేంద్రాల సిబ్బంది, రైస్ మిల్లర్స్‌తో కుమ్మక్కై, రైతులు దళారులకు 75 కేజీల బస్తా రూ. 1200కి అమ్ముకొని, బస్తాకు రూ. 400 నుంచి 500 నష్టపోతున్నారు. * మొక్కజొన్న, పత్తి: మొక్కజొన్న మద్దతు ధర క్వింటాలుకు రూ. 2400 ఉన్నా, వ్యాపారులు రూ. 1600-1700కే కొనుగోలు చేస్తున్నారు. పత్తి కొనుగోలులోనూ యాప్‌ల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. * తుఫాను నష్టపరిహారం: మొంథా తుఫాను వలన రూ. 5500 కోట్ల నష్టం జరిగినా, ఎన్యూమరేషన్ పూర్తయి నెల రోజులు దాటినా రైతులకు నష్టపరిహారం అందించలేదు. * పంటల బీమా: గతంలో ఉన్న ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేసి, ప్రీమియం భారంగా ఉండే స్వచ్ఛంద పంటల బీమా ప్రవేశపెట్టడం వల్ల చాలా మంది రైతులు పథకంలో చేరలేకపోయారు. ప్రధాన డిమాండ్లు: * భూమి లేని కౌలురైతులకు: ఎన్నికల్లో వాగ్దానం చేసిన విధంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రూ. 20 వేలు వెంటనే అమలు చేయాలి. * పంటలకు బోనస్: ధాన్యం, మొక్కజొన్న, పత్తి పంటలను మద్దతు ధరలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కలిపి కొనుగోలు చేయాలి. * ఇతర పంటలు: అరటి, నిమ్మ, బత్తాయి రైతులకు న్యాయం చేయాలి.సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, ఏఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డేగల అప్పలరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో దశలవారీ పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.


