జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 17
తాము చదువుకున్న పాఠశాల మీద మమకారంతో, ఆ విద్యాసంస్థ అభివృద్ధికి తోడ్పాటునందించడం అభినందనీయమని తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం. సుధాకర్ బాబు పేర్కొన్నారు. తర్లుపాడు గ్రామంలోని జెడ్పి ఉన్నత పాఠశాలలో 2007-2008 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థి, ప్రస్తుతం సి.ఆర్.పి.ఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఏర్వ మనోహర్ రెడ్డి తన సొంత ఖర్చులతో పాఠశాలకు భద్రత నిమిత్తం సిసి కెమెరాలను వితరణగా అందజేశారు.వివరాల్లోకి వెళితే పాఠశాల ప్రాంగణంలో భద్రతను పర్యవేక్షించేందుకు మరియు క్రమశిక్షణను మెరుగుపరిచేందుకు సుమారు 43 వేల రూపాయల విలువైన సిసి కెమెరాల సెట్‌ను మనోహర్ రెడ్డి కొనుగోలు చేశారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పరికరాలను ఆయన ప్రధానోపాధ్యాయులు సుధాకర్ బాబుకు అందజేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. దేశ సేవలో ఉంటూనే, తాను చదువుకున్న మూలాలను మర్చిపోకుండా పాఠశాల బాగు కోసం ఆలోచించిన మనోహర్ రెడ్డిని కొనియాడారు. సిసి కెమెరాల ఏర్పాటు వల్ల పాఠశాల ఆస్తుల రక్షణతో పాటు విద్యార్థుల కదలికలను గమనించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమం లో ఏర్వ మహీధర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు


