జనం న్యూస్ 19 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతంగా అమలు: జిల్లా ఎస్పీ.జోగులాంబ గద్వాల్ జిల్లాలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికలు నామినేషన్ ప్రక్రియ మొదలుకొని చివరి విడత కౌంటింగ్ వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పూర్తిగా శాంతియుతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు తెలిపారు. మూడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలు పటిష్టంగా నిలిచాయని ఎస్పీ పేర్కొన్నారు. తీవ్రమైన చలి, కూడా లెక్కచేయకుండా పగలు రాత్రి తేడా లేకుండా విధులు నిర్వహించిన పోలీసుల అంకితభావం వల్లే ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని అన్నారు.పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు, నిరంతర నిఘాతో చిన్న గొడవకూ తావివ్వకుండా పోలీసులు పరిస్థితిని సమర్థంగా నియంత్రించారని ఎస్పీ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి, పోలీస్ శాఖకు సహకరించిన ప్రజలు, ఎన్నికల అధికారులు, మీడియా మిత్రులకు, ఇతర శాఖలకు జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.


