జనం న్యూస్ 20 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లాలో రహదారులపై పశువులు విచ్చలవిడిగా స్వేచ్ఛగా సంచరించే విధంగా విడిచిపెడితే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ డిసెంబర్ 19న హెచ్చరించారు.
రహదారులపై పశువులు సంచరించడం వలన రహదారి ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజల ప్రాణాలు, వాహనదారుల భద్రత దృష్ట్యా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. రహదారులపై పశువులు తిరగడం వలన రోడ్డులు పాడవటం, ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నందున, పశువుల యజమానులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.పశువులను నిర్లక్ష్యంగా రహదారులపై వదిలిపెడుతున్న యజమానులపై కేసులు నమోదుచేసి జైలుకు పంపే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడేలా చేసే విధంగా పశువులను రోడ్లపై తిరగనిచ్చిన వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే మునిసిపల్ అధికారులతో కలిసి జిల్లా పోలీసులు రోడ్డుపై సంచరిస్తున్న పసువులను తరలించి వాటిని జాగ్రత్తగా చూసుకునే వారికి అప్పగించడం జరుగుతుందన్నారు. అదే విధంగా జిల్లాలో బిచ్చగాళ్ళు ప్రజలను ఇబ్బందిపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, అటువంటి వాళ్ళను గుర్తించి చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో ప్రజల భద్రత, ట్రాఫిక్ సౌకర్యం దృష్ట్యా ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


