జనం న్యూస్ 22 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు డిసెంబర్ 23, 2025 (మంగళవారం) న జోగుళాంబ గద్వాల్ జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా, వారి పర్యటన సజావుగా, ప్రశాంతంగా జరిగేలా జిల్లా పోలీస్ శాఖ పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్., ఒక ప్రకటనలో తెలిపారు.
గవర్నర్ మంగళవారం ఉదయం 11:30 గంటలకు అలంపూర్ శ్రీ జోగుళాంబ దేవి ఆలయానికి చేరుకొని, అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠమైన జోగుళాంబ అమ్మవారిని, బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు.అనంతరం గవర్నర్ మధ్యాహ్నం 1:10 గంటలకు జిల్లా కలెక్టరేట్ కు చేరుకొని జిల్లా యంత్రాంగంతో సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో, కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే జిల్లా నుండి రాష్ట్ర, జాతీయ స్థాయిలలో అవార్డులు పొందిన ప్రముఖులతో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించి కూడా తగిన పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ప్రజలు, వాహనదారులు పోలీస్ శాఖకు సహకరించాలని, విధుల్లో ఉన్న పోలీస్ అధికారుల సూచనలు పాటించాలని జిల్లా ఎస్పీ కోరారు.


