Listen to this article

జనం న్యూస్ పిబ్రవరి 04 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

ఆరుగాలం శ్రమించి పంట పండించినా.. దిగుబడి రాకపోవడంతో ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆసిఫాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ సిఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ మండలంలోని బొందగూడ గ్రామానికి చెందిన కొమ్రం పోషయ్య (55) తనకున్న పదేకరాల్లో పత్తి సాగు చేశారు. పత్తి పంట దిగుబడి రాకపోవడంతో నష్టం జరిగిందని ప్రతీ రోజు బాదపడుతూ ఉండేవాడు. దీంతో సోమవారం మధ్యాహ్నం మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. దీంతో అతని కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి చికిత్సా పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. మృతుని కుమారుడు నగేష్ మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రవీందర్ వివరించారు