Listen to this article

కొత్తగూడెం, డిసెంబర్ 26 (జనం న్యూస్):

భారతరత్న మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగూడెం IMA హాల్ నందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జ్ డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జీవీకే మనోహర్ రావు, కుంజా ధర్మ, జంపన సీతారామరాజు, జిల్లా కార్యదర్శి నోముల రమేష్‌తో పాటు జిల్లా పరిధిలోని 28 మండలాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ రాజకీయ దిశను మార్చిన మహానేత అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడారు. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన వాజ్పేయి రాబోయే తరాలకు రాజకీయాలు ఎలా చేయాలి, ఎలా చేయకూడదో ప్రపంచానికి చూపించిన గొప్ప నాయకుడని తెలిపారు. ఒక్క ఓటుతో ప్రభుత్వం నిలిచే అవకాశం ఉన్నప్పటికీ, ఎవరినీ ఆశ్రయించకుండా ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసి ప్రజా తీర్పుకు వెళ్లిన మహానీయుడని ఈ సందర్భంగా గుర్తు చేశారు.జిల్లా ఇన్‌చార్జ్ డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. దొంగ ఓట్లను తొలగించేందుకు SIR అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి దేశవ్యాప్తంగా నిజమైన ఓటర్లను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు, దేశ ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.రాష్ట్ర నాయకులు కుంజా ధర్మ మాట్లాడుతూ గిరిజన మహిళ ద్రౌపతి ముర్ము గారిని రాష్ట్రపతిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీదేనని పేర్కొంటూ, ఇలాంటి నిర్ణయాలు ఇతర పార్టీలలో ఎక్కడైనా జరుగుతాయా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు.
రాష్ట్ర నాయకులు జీవీకే మనోహర్ రావు మాట్లాడుతూ దేశంలో దొంగ ఓట్లు ఉన్నాయని చెబుతున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వద్ద ఉన్న సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు ఇవ్వమని అడిగితే తప్పించుకున్నారని విమర్శించారు. దొంగ ఓట్లు ఉన్నాయని చెబుతున్న నాయకుడికి అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదా? అని ప్రశ్నించారు. ఈ దేశాన్ని 50 సంవత్సరాలు పాలించిన పార్టీకి ఈ విషయాలు తెలియవా? అంటూ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బూత్ లెవల్‌లో బూత్ అధ్యక్షులు, బూత్ కమిటీలు పటిష్టంగా పనిచేయాలని, మండల కమిటీలపై కీలక బాధ్యత ఉందని సూచించారు.ఈ సందర్భంగా ఇటీవల వార్డు మెంబర్లుగా గెలిచిన వారు, అలాగే పోటీ చేసిన అభ్యర్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.