జనం న్యూస్ -డిసెంబర్ 26- నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని శుక్రవారం నాడు పలువురు ప్రముఖులు సందర్శించి సందడి చేశారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి దండపాణి సతీసమేతంగా నాగార్జునసాగర్ ని సందర్శించారు. విజయ విహార్ టూరిజం వసతి గృహానికి చేరుకున్న న్యాయమూర్తి దంపతులకు రెవెన్యూ ప్రోటోకాల్ ఆఫీసర్ దండ శ్రీనివాస్ రెడ్డి, సాగర్ ఎస్ ఐ ముత్తయ్య, నిడమనూరు కోర్టు ప్రోటోకాల్ సిబ్బంది మహేందర్ రెడ్డి, కాలిక్ లు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వీరు నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్ ను, ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం బుద్ధవనాన్ని సందర్శించారు. శుక్రవారం నాగార్జునసాగర్ ని సందర్శించిన వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైల్వే కోర్టు న్యాయమూర్తి రమాదేవి, నల్గొండ జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పవన్ కుమార్లు కుటుంబ సమేతంగా సందర్శించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్ చారిత్రక వివరాలను, బుద్ధవనం విశేషాలను వివరించారు. బుద్దవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్రలు బుద్ధవనం కండువాలతో,బ్రోచర్లతో సత్కరించారు. అనంతరం వీరు మహాస్తూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతులను వెలిగించారు. సమావేశం మందిరంలోని బుద్ధవనం కు సంబంధించిన లగు చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుద్ధవనం సందర్శన మధురానుభూతిని కలిగించిందని అభిప్రాయపడ్డారు.


