జనం న్యూస్ జనవరి 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ అకాల మరణం చెందిన సిబ్బంది కుటుంబాలకు అండగా నిలవడంలో అనకాపల్లి జిల్లా పోలీసు యంత్రాంగం మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ముంచింగిపుట్టు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ, 2021లో అనారోగ్యంతో కన్నుమూసిన చీమల చెల్లయ్య సేవలను గుర్తించి, వారి కుటుంబానికి బాసటగా నిలిచారు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్
మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుమారుడు చీమల చంద్రశేఖర్ కు కారుణ్య నియామకం కింద జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ గా ఉద్యోగ అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులను నేడు ఎస్పీ స్వయంగా అతనికి అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ నియామక పత్రం పొందిన చంద్రశేఖర్‌తో మాట్లాడుతూ..ఉద్యోగంలో చేరే మొదటి రోజున ఏ స్థాయి ఉత్సాహం, క్రమశిక్షణ ఉంటాయో, పదవీ విరమణ వరకు అదే అంకితభావం కొనసాగించాలని కోరారు.ప్రస్తుత సమాజంలో ఉద్యోగ బాధ్యతలు, నైతిక విలువలు మరియు వృత్తి పట్ల గౌరవం కలిగి ఉండాలని హితవు పలికారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, కుటుంబాన్ని గౌరవప్రదంగా చూసుకోవాలని సూచించారు.తన తండ్రి మరణంతో ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబానికి, జిల్లా ఎస్పీ చొరవతో ఉద్యోగం లభించడం పట్ల చంద్రశేఖర్ భావోద్వేగానికి లోనయ్యారు. తమ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించినందుకు ఎస్పీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, క్రమశిక్షణతో విధులను నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏ.ఓ సి.హెచ్.తిలక్ బాబు, సీనియర్ అసిస్టెంట్ బీమాబాయి మరియు ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.//


