Listen to this article

– కామ్రేడ్ వెలిశాల క్రిష్ణమాచారి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు

జనం న్యూస్ పిబ్రవరి 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరోకేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తిరోగమనంగా దేశ అభివృద్ధికి శాపంగా ఉండనున్నదని కార్మికుల సంఘం సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ వెలిశాల క్రిష్ణమాచారి ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సిఐటియు జిల్లా కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెలిశాల క్రిష్ణమాచారి మాట్లాడుతూ.. బడాబాబుల బొజ్జలను మరింతగా నింపేలా మధ్యతరగతి ఉద్యోగులను మభ్యపెట్టేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేసేందుకు ఊతమిచ్చేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఉపాధి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఉపాధి కల్పన, కార్మిక భద్రతకు సంబంధించిన అంశాలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించకపోవడం అన్యాయమన్నారు. విభజన హామీ చట్టంలోని అంశాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పదేండ్ల తర్వాత కూడా పరిష్కరించే చర్యలు తీసుకోకపోవడం మోసం కాక మరేమిటని ప్రశ్నించారు. వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత అని చెప్పి బడ్జెట్ కేటాయింపులు ప్రకటించకుండా రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి మోసగించిందన్నారు. బీమా రంగంలో ఎఫ్డిఐలను 74 శాతం నుంచి 100 శాతం పెంచడం జాతీయ బీమా సంస్థలను బలహీనం చేయడమేనని చెప్పారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకే కేంద్రం సహకరిస్తామని బడ్జెట్లో ప్రకటించడం ఫెడరల్ స్పూర్తికి విఘాతమన్నారు.ఇలా కేంద్ర ప్రభుత్వం మొండిగా బరితెగించి ప్రజావ్యతిరేక విధానాలను అమలు జరుపుతున్న నేపథ్యంలో శ్రామికులు, కర్షకులు, ప్రజానీకం ఐక్యంగా పోరాటాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పెరక శ్రీకాంత్, బాలకిషన్, జిల్లా నాయకులు నంది పద్మ, మాట్ల రాజు, తిరుపతి నవీన్ దుర్గాప్రసాద్ లు పాల్గొన్నారు.