జనం న్యూస్ జనం జనవరి 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ఆహార భద్రత కమిషన్ పర్యవేక్షణకే పరిమితం కాదు, ఫిర్యాదుల పరిష్కారానికీ ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ ఛైర్మన్ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి అన్నారు. కన్సూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన శనివారం ‘మేలుకో… హక్కులు తెలుసుకో – అందరి చుట్టం వినియోగదారుల రక్షణ చట్టం’ బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్తా విజయ్‌ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లోకి వచ్చిన 2013 నుంచి దేశంలో ఆహార భద్రత చట్టబద్దమైన హక్కుగా దక్కిందన్నారు. ఈ చట్టం ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, విచారణ అనంతరం బాధ్యులపై కమిషన్ చర్యలకు ఉపక్రమిస్తుందన్నారు. రేషన్ సరుకులు పంపిణీలో అవకతవకలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీల ద్వారా అందుతున్న పౌష్టికాహార పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం అమలులో లోపాలను ఆహార భద్రత కమిషన్‌కు లిఖితపూర్వకంగా లేదా వాట్సప్ నెంబర్ 9490551117కు ఫిర్యాదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వినియోగదారులు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, మోసపోయినప్పుడు చట్టపరమైన రక్షణ పొందడం ద్వారానే వ్యవస్థలో మార్పు వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆహార భద్రతలో లోపాలు ఉన్నప్పుడు లేదా హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయవాది అవసరం లేకుండా బాధితులు వినియోగదారుల కమిషన్లను ఆశ్రయించి న్యాయం పొందే హక్కు ప్రజలకు ఉందని విజయ్‌ప్రతాప్‌రెడ్డి అన్నారు. హక్కులు ఎన్ని ఉన్నా … పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించనంత కాలం వ్యవస్థలో పూర్తిస్థాయి మార్పు రాదని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం పరిజ్ఞానం, బాధ్యతతో ప్రశ్నించేతత్వాన్ని పౌరులు అలవరచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి కొనుగోలుకు రసీదు తీసుకోవాలని, రసీదు లేని కొనుగోలు వినియోగదారుడికి చట్టపరమైన రక్షణను దూరం చేస్తుందన్నారు. వినియోగదారుల రక్షణ చట్టం ప్రతి పౌరుడికి అండగా నిలుస్తుందని, అయితే అవగాహన లేకపోవడం వల్ల చాలామంది నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో ‘మేల్కొన్న వినియోగదారులే విజేత’లుగా నిలుస్తారని కాబట్టి ‘మేలుకో … హక్కులు తెలుసుకో’ నినాదం ప్రతి ఒక్కరి అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ ఛైర్మన్ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కన్సూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ, సర్వేజన ఐక్యవేదిక వ్యవస్ధాపకులు కోరిబిల్లి పరమేష్ (పరి), హాస్య కళాసమితి వ్యవస్దాపకులు విల్లూరి సంతోష్‌కుమార్, బుద్ద ప్రవీణ్‌కుమార్, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు


