Listen to this article

పగిలిన పైప్‌లైన్‌ను పట్టించుకోని హెచ్‌ఎండబ్ల్యూఎస్ అధికారులు

నీట మునిగిన రహదారులు – నరకయాతన పడుతున్న ప్రజలు

జనం న్యూస్ జనవరి 04 సంగారెడ్డి జిల్లా

పటాన్‌చెరు మండలం ముత్తంగి మున్సిపాలిటీ పరిధిలో అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మంజీరా నీటి పైప్‌లైన్ పగిలి భారీగా తాగునీరు వృథాగా పోతోంది. ముత్తంగి మున్సిపాలిటీ ప్రధాన రహదారి పక్కన, ఉన్న మంజీరా పైప్‌లైన్ దెబ్బతినడంతో రోజంతా నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది.ఈ లీకేజీ కారణంగా పార్ధ నగర్ కాలనీ పరిసర ప్రాంతాల రోడ్లు పూర్తిగా నీటితో నిండిపోయి, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు రోడ్లపై నడవలేని పరిస్థితి నెలకొంది. రాత్రి వేళల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రమాదాలకు కూడా అవకాశం ఏర్పడుతోంది.ఒకవైపు కొన్ని కాలనీల్లో తాగునీటి సమస్యతో ప్రజలు అవస్థలు పడుతుంటే, మరోవైపు మంజీరా నీరు ఇలా నిర్లక్ష్యంగా వృథా అవుతుండటం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైప్‌లైన్ పగిలిన విషయం గురించి సంబంధిత హెచ్‌ఎండబ్ల్యూఎస్ అధికారులకు సమాచారం ఇచ్చినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది.ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి తాగునీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. నీటి వృథాతో పాటు, రోడ్లపై నిలిచిన నీటివల్ల దోమల బెడద పెరిగే ప్రమాదం కూడా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా హెచ్‌ఎండబ్ల్యూఎస్ అధికారులు స్పందించి, తక్షణమే పగిలిన మంజీరా పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టి, నీటి వృథాను అరికట్టాలని, ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని పార్ధ నగర్ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.