జనం న్యూస్: జనవరి 10 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)
కోడి పందెం, జూదం మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాలపై సమాచారం ఉంటే వెంటనే 112 కు డయల్ చెయ్యడం లేదా పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266 కు సమాచారం తెలియజేయాలి.సంక్రాంతి పండుగ నేపథ్యంలో సాంప్రదాయ క్రీడలైన కబడ్డీ, ఖో-ఖోతో పాటు బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్‌బాల్, క్రికెట్ వంటి క్రీడలను నిర్వహించుకోవాలని, అలాగే పండగలను కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు.జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, శివార్లు తదితర ప్రాంతాల్లో కోడి పందాలు, జూదాలు మరియు గుండాట నిర్వహించడం నిషేధమని జిల్లా ఎస్పీ తెలిపారు. అలాగే, ఎవరైనా కోడి పందాలు ఆడినా లేదా వాటిని ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.జిల్లాలో కోడి పందేలు, జూదాలను కట్టడి చేయడానికి పోలీసు అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోడి పందేలు, పేకాట స్థావరాలను ముందుగానే గుర్తించి డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టాలన్నారు. పోలీసు అధికారులు గ్రామ పెద్దలతో సమావేశాలు నిర్వహించి కోడి పందేలు మరియు ఇతర జూదాలు జరగకుండా చూడాలన్నారు. గతంలో కోడి పందేలు, జూదాల్లో పట్టుబడిన వ్యక్తులను బైండోవర్ చేయాలని సూచించారు. అలాగే, కోడి పందాలకు ఉపయోగించే కత్తులను తయారు చేసే వారు, వాటిని సరఫరా చేసే వారు, పందాలు నిర్వహించేందుకు స్థలాలు కేటాయించే వారిని గ్రామస్థాయిలో గుర్తించి, మంచి ప్రవర్తన కొరకు వారిని కూడా బైండోవర్ చేయాలని ఆదేశించారు. పండగ రోజులలో కోడి పందేలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, సంప్రదాయ క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చి సంక్రాంతి పండగను జరుపుకోవాలని సూచించారు. చట్టవిరుద్ధమైన కోడి పందాలు, జూద క్రీడలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, సాంప్రదాయ సంక్రాంతి క్రీడా పోటీలు ప్రజల్లో సహృద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.జిల్లాలో ఎక్కడైనా కోడి పందెం, జూదం మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112కు లేదా పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు సమాచారాన్ని అందించాలని జిల్లా ఎస్పీ తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయన్నారు.


